హర్యానాలో బీజేపీ విజయం ఎన్డీయేకు శుభసూచకం

హర్యానాలో బీజేపీ విజయం ఎన్డీయేకు శుభసూచకం

హర్యానాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎన్ని అపోహలు, ప్రచారాలు జరిగినా హర్యానాలో ఎన్డీఏ గెలవడం మంచి పరిపాలనపై నమ్మకంతోనే అని స్పష్టం చేశారు.ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపానని పేర్కొన్నారు.

జమ్మూ కశ్మీర్లో బలమైన పార్టీగా బీజేపీ అవతరించిందని చెప్పారు. చెప్పే విధానం సరిగ్గా ఉండి, చేసేది మంచైనప్పుడు ఇలాంటి ఫలితాలే వస్తాయని వెల్లడించారు. మహారాష్ట్ర, జార్ఖండ్లలో త్వరలో జరిగే ఎన్నికల్లో కూడా ఈ తరహా ఫలితాలే వస్తాయని విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

కాగా, జమిలి ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలిపాలని సీఎం చంద్రబాబు కోరారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే భారతదేశం 3వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 అంతే కాకుండా దేశంలో 7 శాతం వృద్ధి రేటు ఉందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అందువల్ల వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. పీపీపీ విధానంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు. సుస్థిరమైన పాలన ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు.

పీఎం సూర్య ఘర్‌ ద్వారా దేశంలో ఇంటింటికీ సౌరశక్తి వెలుగులు తెస్తున్నారని సీఎం చంద్రబాబు వివరించారు. కొందరు వ్యక్తులు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశాభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నందుకు గర్వపడుతున్నామని స్పష్టం చేశారు. వనరులు సరిగా వినియోగించుకుంటే అద్భుతాలు సాధ్యమని వెల్లడించారు. 

ప్రణాళికలు వేయడమే కాదు సరిగా అమలుచేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతూ 2047 నాటికి మనదేశం అన్నింట్లో అగ్రగామిగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. “విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం ఎలా ధ్వంసమైందో గత ఐదేళ్లూ చూశాం. హర్యానాలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. సుపరిపాలన వల్ల వచ్చే లాభాలను ప్రజలు చూశారు” అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 

“బీజేపీ అగ్రనాయకత్వం పనిచేసే విధానం వల్ల హర్యానాలో గెలిచారు. హర్యానాలో విజయం ఎన్డీఏకు శుభసూచిక. మోదీ పాలనపై ప్రజలు నమ్మకం ఉంచారు. సుస్థిరత, అభివృద్ధికి హరియాణా ప్రజలు ఓటేశారు” అంటూ చెప్పుకొచ్చారు.  ఈవీఎంలపై చెత్త మాటలు మాట్లాడటానికి జగన్‌కు సిగ్గుండాలంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద అరిష్టం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలానికి మారు పేరుగా వైసీపీ మారితే బూతుల్ని పేటెంట్‌గా వైసీపీ నాయకులు తీసుకుంటున్నారంటూ విమర్శించారు.