* చరిత్ర సృష్టించిన హైదరాబాద్ అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్
ఆలస్యంగా ప్రారంభమైనా నింగిలోకి దూసుకెళ్లిన కొద్ది నిమిషాల్లోనే అత్యంత కీలకమైన మూడో దశ (ఎస్3) అనుకున్న టైమ్‌లైన్ ప్రకారమే విజయవంతంగా విడిపోయింది. ఈ ప్రయాణంలో రాకెట్‌కు అమర్చిన హై-రిజల్యూషన్ కెమెరాల ద్వారా అంతరిక్షం నుంచి మన భూమికి సంబంధించిన అద్భుతమైన లైవ్ దృశ్యాలు కనిపించాయి.
గగనతలం నుంచి నీలిరంగులో మెరుస్తున్న భూగోళం తాలూకు విజువల్స్ స్క్రీన్‌లపై ప్రత్యక్షమవ్వగానే లాంఛ్ కంట్రోల్ సెంటర్‌లోని శాస్త్రవేత్తలు, గ్యాలరీలోని విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు. రాకెట్ ప్రయాణంలో అత్యంత కీలకమైన చివరి, నాలుగో దశ (ఎస్4) పనితీరు కూడా అద్భుతంగా, అనుకున్న రీతిలోనే సాగింది. 3డి-ప్రింటెడ్ టెక్నాలజీతో రూపొందించిన ‘రామన్’ ఇంజిన్లు పక్కాగా పనిచేసి, రాకెట్‌ను లక్ష్యం వైపు నడిపించాయి.
నాలుగో దశ (ఎస్4) ప్రయాణం ముగియగానే, ప్లాన్ ప్రకారం ‘రామన్’ ఇంజన్లు విజయవంతంగా ఆగిపోయాయి (కటాఫ్ అయ్యాయి) . ఇంజిన్ కటాఫ్ ప్రక్రియ పక్కాగా జరగడంతో రాకెట్ తన లక్ష్యాన్ని వంద శాతం చేరుకుంది. ఇంజిన్ ఆగిపోయిన వెంటనే, రాకెట్ మోసుకెళ్లిన ఉపగ్రహాలన్నీ (శాటిలైట్లు) ఒకదాని తర్వాత ఒకటి విజయవంతంగా విడిపోయిఅంతరిక్షంలోకి ప్రవేశించాయి. అంతరిక్ష వ్యర్థాలను తొలగించే రోబోటిక్ హ్యాండ్ సహా అన్ని పేలోడ్స్‌ను నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.
ప్రధాని మోదీ హర్షం
ఈ ప్రయోగం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కక్ష్యలోకి ఉపగ్రహాలు, పేలోడ్స్ చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ ఆ కంపెనీ యజమానులుకు ఫోన్ చేసి మాట్లాడారు. భారత స్వయం సమృద్ధిని ఈ ప్రయోగం చాటుతుందని ఆయన తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ ఈసీవో పవన్ కుమార్ చందన, సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ డాకాతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.
మిషన్ ఆగమనం మరింత ముందుకు వెళ్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మిషన్‌తో మనం ఆత్మనిర్భర్ అని నిరూపించుకున్నామని పేర్కొన్నారు. రాకెట్ పూర్తి ఇండియాలోనే డిజైన్ చేసి, తయారు చేసినట్లు చందన తెలిపారు. ప్రయోగం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వందేమాతరం ప్రధాని వ్రాసిన లేఖను విజయవంతంగా కక్ష్యలోకి చేరినట్లు స్కైరూట్ సీఈవో తెలిపారు.
భారతీయ అంతరిక్ష ప్రయాణంలో ఇది అత్యంత ముఖ్యమైన సందర్భమని చెప్పారు. ప్రైవేటు రంగంలో కొత్త భాగస్వామ్యుల పాత్ర పెరుగుతోందని, దీంతో ఆవిష్కరణలు ఊపందుకున్నట్లు మోదీ తెలిపారు. ఈ ఘనత అనేక మంది భారతీయ యువతలో ప్రేరణ నింపుతుందని, దీంతో ఆ యువత తమ కలలను సాకారం చేసుకునే సందర్భం వస్తుందని పేర్కొన్నారు. నిర్భయంగా యువత తమ ఆవిష్కరణలకు రూపం ఇవ్వనున్నట్లు ప్రధాని తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపారు.
ఇప్పటివరకు అంతరిక్ష ప్రయోగాలన్నీ ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రో మాత్రమే చేస్తూ వచ్చేది. కానీ ఈ ప్రయోగంతో పూర్తి స్థాయి ఆర్బిటల్ రాకెట్‌ను కక్ష్యలోకి పంపే తొలి ప్రైవేట్ స్టార్టప్‌గా “స్కైరూట్ ఏరోస్పేస్” సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏడు అంతస్తుల ఎత్తు గల ఈ రాకెట్ ఎన్నో సాంకేతిక ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంది.
బరువు తగ్గించడం కోసం దీనిని పూర్తిగా బలమైన ‘ఆల్-కార్బన్ కాంపోజిట్’ నిర్మాణంతో తయారు చేశారు. నాలుగు దశలు గల ఈ రాకెట్ చివరి దశలో 3డు-ప్రింటెడ్ టెక్నాలజీతో చేసిన ద్రవ ఇంధన ఇంజిన్లను ఉపయోగించారు.చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో, చాలా వేగంగా అంతరిక్షంలోకి పంపడానికి ఈ రాకెట్ ఒక ‘స్పేస్ క్యాబ్’ లాగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. .

More Stories
సోనమ్ వాంగ్‌చుక్ తొలగింపును సమర్థించుకున్న బీజేపీ
ఏపీలో 12 కరోనా కేసులు.. ఆందోళన అవసరం లేదన్న మంత్రి
మూడింట రెండు వంతుల మెజారిటీకి 6 ఎంపీల దూరంలో ఎన్డీయే!