ఏపీ ఆల‌యాల్లో వైదిక‌, ఆగ‌మ విష‌యాల్లో స్వ‌యం ప్ర‌తిప‌త్తి

ఏపీ ఆల‌యాల్లో వైదిక‌, ఆగ‌మ విష‌యాల్లో స్వ‌యం ప్ర‌తిప‌త్తి
ఆంధ్ర ప్రదేశ్ లోని  దేవాల‌యాల‌కు వైదిక‌, ఆగ‌మ విష‌యాల్లో స్వ‌యం ప్ర‌తిప‌త్తిని  రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పించింది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం ఉండ‌కూడ‌దని స్ప‌ష్టం చేసింది. ప్ర‌తి ఆల‌యానిక వైదిక క‌మిటీ నియ‌మించాల‌ని, నూతన సేవలు, ఫీజులు, కళ్యాణోత్సవ ముహూర్తాలు వంటి అంశాల్లో కమిటీ సూచనలు అధికారులు పాటించాల‌ని పేర్కొంది.

ఒకవేళ కమిటీలో భిన్నాభిప్రాయాలు ఉంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాల‌ని సూచించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్. సత్య నారాయణ జీవో నెంబ‌ర్ 223 పేరుతో కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ స్పెష‌ల్ కమీషనర్ నివేదించిన అంశాల‌ను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలించిన తరువాత‌, అనుగుణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ధర్మాదాయ, హిందూ మత సంస్థలు, దేవాదాయ చట్టం-1987లోని సెక్షన్ 13(1) ప్ర‌కారం వైదిక, ఆగమ విషయాలలో ఆలయాలకు స్వయంప్రతిపత్తిని నిర్ధారించడానికి, సంబంధిత దేవాలయాల ఆచారాలు, సంప్రదాయాల పవిత్రతను ఎటువంటి భంగం లేకుండా కాపాడటం, చట్టబద్ధమైన నిబంధనలను ఖచ్చితంగా పాటించడం కోసం అన్ని శాఖల అధికారులకు ఉత్తర్వులను జారీ చేసిన‌ట్లు పేర్కొన్నారు.

సంబంధిత ఆలయాలపై పరిపాలనా నియంత్రణ కలిగి ఉన్న కమిషనర్, ప్రాంతీయ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్‌తో సహా ఏ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ కూడా ఆయా ఆలయాల ఆగమ సంప్రదాయాలు, ఆచారాలు, ఉప‌యోగాల‌పై ఏ విధంగానూ జోక్యం చేసుకోకూడదని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

దేవుళ్లకు ఆచారాలు,సేవలను నిర్వహించే విధానం, యాగాలు, కుంభాభిషేకాలు, ఇతర పండుగల నిర్వహణకు ముహూర్తాలు నిర్ణయించడం, నూత‌న‌ సేవలు, ఆచారాలను ప్రవేశపెట్టడం మొదలైన వాటితో సహా అన్ని ముఖ్యమైన మతపరమైన విషయాలపై నిర్ణయాలు తీసుకోవడంలో దేవాలయంలోని సీనియర్ మోస్ట్ అర్చకులు, మతపరమైన సిబ్బంది అభిప్రాయాలకు క‌ట్టుబ‌డి ఉండాలి.

దీని కోసం కార్యనిర్వాహక అధికారులు (ఈవో) అన్ని 6(ఏ) దేవాలయాలలో సంబంధిత దేవాలయాలలోని అత్యంత సీనియర్ మతపరమైన సిబ్బందితో వైదిక కమిటీలను ఏర్పాటు చేయవచ్చు. అటువంటి కమిటీ సభ్యుల మధ్య ఏవైనా సందేహాలు తలెత్తినా లేదా ఏవైనా అభిప్రాయ భేదాలు తలెత్తినా, ఆ ఆగమానికి సంబంధించిన ప్రముఖ పీఠాధిపతుల అభిప్రాయాన్ని సంప్రదించాలి.

దీనికోసం ప్రతి మతపరమైన సంస్థను ఒకే సంస్థగా పరిగణించాలి. ఏ మత సంస్థ మరొక మత సంస్థ ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను అనుసరించాలని పట్టుబట్టరాదు. అటువంటి ఇతర సంస్థ కూడా అదే ఆగమానికి చెందినప్ప‌టికీ జోక్యం ఉండ‌రాదు. సంబంధిత కార్యనిర్వాహక అధికారులు దేవుళ్ల‌కు ఆచారాలు, సేవల్లో జోక్యం చేసుకోకూడదని పేర్కొంది.

యాగాలు, కుంభాభిషేకాలు, ఇతర పండుగలు మొదలైన వాటి నిర్వహణకు ముహూర్తాలు నిర్ణయించడం, ఆగమ సంప్రదాయాలు, ఆచారాలు, ఉపయోగాల నుండి ఎటువంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా అధికారులు చూసుకోవాలి. ఎండోమెంట్స్ కమిషనర్ ఈ విషయంలో అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.