మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబంపై భూ కబ్జా కేసు

మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబంపై భూ కబ్జా కేసు
భూమిని కబ్జా చేసేందుకు యత్నించారనే ఆరోపణలపై  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబసభ్యులపై శ్రీకాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 13 మంది మీద శ్రీకాకుళం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ 13 మందిలో ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసినట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి  వెల్లడించారు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీకాకుళంలోని బలగ పరిధిలో ఉన్న 35/13 సర్వే నంబర్‌లోని భూమిని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నించారు. ఈ భూమి విలువ మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకూ ఉంటుంది. అయితే 1992 నుంచి 1998 సంవత్సరం మధ్య ఈ భూమికి సంబంధించి కొన్ని అమ్మకాల లావాదేవీలు జరిగాయి. ఇదంతా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో ఆయన స్పీకర్‌గా ఉన్నప్పుడే జరిగింది. ఇటీవల బాధితుడి ఫిర్యాదుతో కబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది.
 
ఈ క్రమంలోనే భూమి అసలు యజమాని అయిన అంధవరపు గోవిందరాజులు అనే వ్యక్తి బతికి ఉండగానే చనిపోయినట్లు తప్పుడు డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. ఈ డెత్ సర్టిఫికేట్ సాయంతో ఒడిశాకు చెందిన అడబాల రజనీ అనే మహిళను అంధవరపు గోవిందరాజులు కుమార్తె అంధవరపు రజనీగా పేర్కొంటూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తయారు చేశారు. 
 
ఆ తర్వాత ఈ భూమిని తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించారు. అనంతరం ఈ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించే ప్రయత్నం చేపట్టగా అసలు యజమాని కుటుంబం అడ్డుపడింది. ఆ తర్వాత గోవిందరాజులు అల్లుడు కనకలింగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
నకిలీ పత్రాలు సృష్టించడంతో పాటుగా తప్పుడు వారసత్వం, తప్పుడు రిజిష్ట్రేషన్‌ అంశాలు బయటపడ్డాయి. ఈ భూ కబ్జాకు యత్నించిన ఘటనలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌ మీద కేసు నమోదైంది. అలాగే ఈ వ్యవహారం వెనుక ప్రస్తుతం హిరమండలం సబ్‌రిజిస్ట్రార్‌‌గా ఉన్న బొడ్డేపల్లి అరుణ కూడా ఉన్నట్లు గుర్తించామని శ్రీకాకుళం ఎస్పీ తెలిపారు.

ఈ కేసులో ఏ1గా ఉన్న అడబాల రజనీ, ఏ2 తెలుగు సతీష్ కుమార్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ఏ5గా ఉన్న తమ్మినేని చిరంజీవి నాగ్, ఏ6 తమ్మినేని సీతారాం, ఏ7 తమ్మినేని వాణి, ఏ13 అరుణలపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.