నెహ్రూ సోషలిజాన్ని వర్తింపచేసే ప్రయత్నంతో దేశం వెనుకంజ 

భారతీయ విలువలు, ఆలోచనా విధానం పట్ల శ్రద్ధా నిష్ఠలు లేని నెహ్రు లండన్‌లో చదువుకునే రోజుల్లో నేర్చుకున్న సోషలిజాన్ని ఇక్కడ వర్తింప చేయడంతోనే భారత్ అభివృద్ధిలో వెనుకబడిందని బిజెపి ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ తెలిపారు.  విజయవాడలో బిజెపి ఆధ్వర్యంలో దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా `ఇజం నీ పయనం ఎటు?’ అంశంపై జరిపిన కార్యక్రమంలో మాట్లాడుతూ 1925లోనే తాను సోషలిస్టునని ప్రకటించుకున్న నెహ్రూ  1929లో కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారని,  ఆ చిన్న వయసు నుంచే కాంగ్రెస్ ఉద్యమాన్ని సోషలిస్టు విధానాలతో ముందుకు తీసుకెళ్లాలని చూశారని చెప్పారు.

1936లో పటేల్, రాజేంద్ర ప్రసాద్ వంటి 8-9 మంది సీనియర్ నాయకులు “నువ్వు సోషలిజం పిచ్చి వదలకపోతే మేము కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తాం” అని సిద్ధపడ్డారని, అప్పుడు గాంధీ జోక్యం చేసుకుని, నెహ్రూతో మాట్లాడి “సోషలిజాన్ని కాంగ్రెస్ పార్టీపై రుద్దను” అని ఆయన నుండి వాగ్దానం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, స్వాతంత్య్రం వచ్చి గాంధీ, పటేల్  దివంగతులయ్యాక, 1952 ఎన్నికల తర్వాత నెహ్రూ మళ్లీ సోషలిస్టు రాగాలాపన మొదలుపెట్టారని తెలిపారు. 

 
ఎకనామిక్స్ చదవని, కెమిస్ట్రీ చదివిన స్టాటిస్టీషియన్. కలకత్తాలో ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతున్న  ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ ను తీసుకొచ్చి, భారతదేశంలో సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించే ప్రయత్నం మొదలుపెట్టారని రామ్ మాధవ్ వివరించారు. 1955లో తమిళనాడులోని ఆవడి  కాంగ్రెస్ సభల్లో “సామ్యవాద తరహా సమాజం” అనే తీర్మానాన్ని ఆమోదించారని గుర్తు చేశారు. 
 
నెహ్రూ  భారతీయ విలువులను ఎప్పుడూ పెద్దగా గౌరవించలేదని చెబుతూ అయితే ఆయనకు ఇవి తెలియవని కాదని, ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ వంటి పెద్ద పుస్తకాలు రాశారని, భారతీయ సంస్కృతి గురించి మాట్లాడారని చెప్పారు.   మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభభాయి పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, లోకమాన్య తిలక్, లాలా లజపతి రాయ్ వంటి మహనీయులందరూ స్వతంత్ర భారతదేశం గురించి ఒక స్పష్టమైన ఆలోచనతో పోరాటం చేశారని, స్వాతంత్య్రం పొందిన భారతదేశం భారతీయ విలువలకూ, సంస్కృతీ పరంపరకూ ఆలవాలంగా అభివృద్ధి చెందుతుందని ఆశించారని రామ్ మాధవ్ వివరించారు.
 
గాంధీ గారు దానికి ‘రామరాజ్యం’ అని పేరు పెట్టారని, స్వతంత్ర భారతం రామరాజ్యం అవుతుందని ఆయన తన రచనల్లో, ఉపన్యాసాల్లో బహిరంగంగా చెప్పారని తెలిపారు.  ఆ రోజుల్లో జాతీయ భావాలు, భారతీయ సంస్కృతి పట్ల నిష్ఠ ఉన్న నాయకులలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఒకరని పేర్కొంటూ  ఆయన అప్పటి ఆర్‌ఎస్‌ఎస్  నాయకత్వాన్ని కలసి, “భారతీయ సంస్కృతి పునాదులపై ఒక రాజకీయ ఉద్యమాన్ని నడిపిస్తాం, జాతీయ భావాలున్న కార్యకర్తలను ఇవ్వండి” అని  గురూజీ గోల్వాల్కర్ ని కోరారని తెలిపారు.
 
దాంతో ఆర్‌ఎస్‌ఎస్ నుంచి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌.కె. అడ్వాణీ వంటి ఉత్తమ కార్యకర్తలు రాజకీయ రంగంలోకి వచ్చారని చెప్పారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టులు, సోషలిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేదని, కానీ 2026 నాటికి కమ్యూనిజం గురించి చర్చించడం అంటే ‘చచ్చిన పామును చంపడమే’ అని స్పష్టం చేశారు. భారతదేశంలో అరాచకవాద కమ్యూనిజం, నక్సలిజంలను పూర్తిగా రూపుమాపామని,  కొంతమంది ‘దిమాగీ నక్సలైట్లు’ (అర్బన్ నక్సల్స్) మాత్రమే మిగిలారని చెప్పారు.
 
దీనదయాళ్ ప్రతిపాదించిన ‘ఏకాత్మ మానవవాదం’ చూడడానికి కాస్త సంక్లిష్టంగా అనిపించినప్పటికీ, దాని సారాంశం చాలా సరళమైనదని, మన జాతీయ జీవనంలో మన విలువలు, ఆలోచనలు, ప్రాచీన మహాపురుషులు ఇచ్చిన సందేశాలు, ఉపదేశాల ఆధారంగానే మన జీవన వ్యవస్థలన్నీ నడవాలనేది దాని ముఖ్య ఉద్దేశం అని రామమాధవ్ వివరించారు. దానికి కట్టుబడి సామాజిక రంగంలో పనిచేస్తున్న అనేక సంస్థలు, రాజకీయ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్యకర్తలు నేడు ఉన్నారని తెలిపారు. 

1917లో రష్యాలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిందని, కానీ నియంతృత్వం, అణచివేతలతో నడిచిన ఆ వ్యవస్థ 70 ఏళ్లలోనే కూలిపోయిందని, ప్రపంచమంతా దాన్ని తిరస్కరించిందని రాంమాధవ్ చెప్పారు. భారతదేశంలో కూడా 2011లో బెంగాల్‌లో, 2017లో త్రిపురలో కమ్యూనిజం ముగిసిపోయిందని, ఇవాళ కేరళలోనూ అధికారం కోల్పోయారని చెప్పారు. జాతీయ భావం లేకపోవడం, తప్పుడు సిద్ధాంతాలు కావడం వల్లే ప్రజలు వారిని తిరస్కరించారని తెలిపారు. డబ్బు ఉన్న ప్రతి ఒక్కడూ దోపిడీదారే అనే తప్పుడు ఆలోచనను వారు సమాజంలో నూరిపోసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.

కాగా, ఈ రోజు మనం ప్రధాన స్రవంతిలో ఉన్నామని, ఆర్‌ఎస్‌ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సంస్థగా నిలిచిందని చెప్పారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ‘అంత్యోదయ’ (సమాజంలో చివరి వ్యక్తికి కూడా ఫలాలు అందడం) భావనకే మోదీ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. గాంధీ చెప్పిన రామరాజ్యం కూడా అదే—సమాజంలో అత్యంత బలహీనుడికి కూడా బలవంతుడితో సమానమైన శక్తి, గౌరవం లభించే వ్యవస్థ అని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు 
పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ.. జాతీయ భావాలకు వ్యతిరేకంగా ఉండే సిద్ధాంతాలను, అంశాలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తిరస్కరిస్తూనే ఉన్నారని చెప్పారు.  విద్యార్థులలో జాతీయ భావం పెరగకుండా అడ్డుకునేందుకు కమ్యూనిస్టులు ఉపయోగిస్తున్న యుక్తులను తాను విద్యార్థిగా ఉండగా ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. నేడు కూడా అనేక విశ్వవిద్యాలయాలలో ఇటువంటి దేశవ్యతిరేక ఆలోచనలకు చోటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 

 
తద్వారా దేశంలో ‘దిమాగీ నక్సలిజం’ (అర్బన్ నక్సలిజం) పెద్ద ఎత్తున విస్తరించే కుట్ర నడుస్తోందని మాధవ్ హెచ్చరించారు.  అటువంటి అరాచక ఆలోచనలను ఎదుర్కోవడానికి తగిన సిద్ధాంత బలం, సరైన సమాచారం మన దగ్గర ఉండాలని,  విషయాలను స్పష్టంగా విశ్లేషించి వారికి ధీటుగా సమాధానం చెప్పే శక్తిని మనం పెంపొందించుకోవాలని చెప్పారు.  ఈ సందర్భంగా డా. దుగ్గరాజు శ్రీనివాసరావు కమ్యూనిజంపై వ్రాసిన గ్రంధాన్ని ఆవిష్కరించారు. 
 

About The Author