బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్‌కు నిద్రలేని రాత్రులు

ఉత్తరప్రదేశ్‌లో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులు, ఏకె-203 అసాల్ట్ రైఫిల్స్ పాకిస్థాన్, నక్సలిజంకు “కంటి మీద కునుకు లేకుండా” చేస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. రక్షణ రంగ ఉత్పత్తిలో ఆ రాష్ట్రం అందిస్తున్న సహకారాన్ని ఆయన  కొనియాడారు.గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో శుక్రవారం ప్రారంభమైన నాలుగవ ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవంలో షా ప్రసంగీస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు, ఉత్పత్తి వేగంగా బలపడుతుండటంతో, ఉత్తరప్రదేశ్ దేశ వృద్ధికి ఒక చోదక శక్తిగా (ఇంజిన్‌గా) ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.
 
సుమారు 12 ఏళ్ల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని ప్రారంభించారని గుర్తుచేస్తూ, ఆ తర్వాత తయారీ,  ఆవిష్కరణల రంగంలో భారతదేశాన్ని “ప్రపంచ కేంద్రం”గా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేశాయని అమిత్ షా తెలిపారు. అంతేకాకుండా, ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐదు ఆర్థిక వ్యవస్థల సరసన చేరడం ద్వారా భారతదేశం సాధిస్తున్న ఆర్థిక శక్తిని ఆయన నొక్కి చెప్పారు. 
 
సవాలుతో కూడిన ప్రపంచ పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశ వృద్ధి రేటు స్థిరంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. మొదటి ఎడిషన్ సమయంలో వ్యాపారులు రాష్ట్రాన్ని సందర్శించడానికి ఆసక్తి చూపారని, రెండు, మూడవ ఎడిషన్లలో వారి భాగస్వామ్యం పెరిగిందని, ఇప్పుడు ఈ నాలుగవ ఎడిషన్‌లో పారిశ్రామికవేత్తలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ముందుకు వస్తున్నారని కేంద్ర హోం మంత్రి గమనించారు. 
 
“ఈ వాణిజ్య ప్రదర్శన కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు వచ్చారు.  దీనివల్ల రాష్ట్రంలో పెట్టుబడులు, ఉత్పత్తి, అమ్మకాల వృద్ధికి అవకాశాలు ఏర్పడ్డాయి” అని హోంమంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలనే లక్ష్యాన్ని సాధించడంలో పారిశ్రామికవేత్తలు కీలక పాత్ర పోషిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
2017కి ముందు ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదని, రాష్ట్రం “మాఫియా ప్రభావంలో” ఉండేదని ఆయన ఆరోపించారు. మెరుగైన శాంతిభద్రతలను నెలకొల్పడంతో పాటు, పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని, ఉపాధి అవకాశాలను కల్పించిన ఘనత యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.
 
“యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎస్పీ-బీఎస్పీ ప్రభుత్వాల హయాంలో ఉన్న అరాచకత్వాన్ని బిజెపి ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఫలితంగా, ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది” అని ఆయన  చెప్పారు. ఆగ్రా, అలీగఢ్ వంటి ప్రాంతాలలో రక్షణ కారిడార్ ద్వారా రక్షణ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని అమిత్ షా పేర్కొన్నారు.
 
దేశ రక్షణ రంగ ఉత్పత్తి విలువ రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా, భారత్ ప్రస్తుతం దాదాపు 80 దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని, ఈ ఘనతలో ఉత్తరప్రదేశ్ “కీలక పాత్ర” పోషిస్తోందని ఆయన చెప్పారు. “నేడు ఉత్తరప్రదేశ్‌లో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇది అక్కడ జరుగుతున్న మార్పుకు ఒక ప్రధాన నిదర్శనం,” అని లక్నోలోని బ్రహ్మోస్ తయారీ కేంద్రాన్ని ప్రస్తావిస్తూ షా పేర్కొన్నారు.  

ఈ కార్యక్రమంలో భాగంగా అమిత్ షా ‘ఓడిఓపి’ (ఒకే జిల్లా – ఒకే ఉత్పత్తి) నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా యూపీ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా సొంత ఊర్లోనే ఉద్యోగాలు పొందుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ట్రేడ్ షో ద్వారా స్థానిక తయారీదారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

About The Author