* మాజీ ప్రధాన న్యాయమూర్తి ఖేహర్
భారతదేశపు మొదటి సిక్కు ప్రధాన న్యాయమూర్తి జగదీష్ సింగ్ ఖేహర్, ఆదివారం న్యూఢిల్లీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ‘రాష్ట్ర వందనం’ పేరుతో ఓభారీ ప్రచార కార్యక్రమంలో సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తో కలిసి పాల్గొంటూ 1984 నాటి మతపరమైన అల్లర్ల సమయంలో సిక్కులను రక్షించడంలోనూ, దేశ విభజన కాలంలో పంజాబ్‌లో సహాయక చర్యలు చేపట్టడంలోనూ సంఘ్ కార్యకర్తలు పోషించిన పాత్రను కొనియాడారు.
ఢిల్లీ విభాగం నిర్వహించిన ‘రాష్ట్ర వందనం’ కార్యక్రమంలో మోహన్ భగవత్‌కు ముందుగా ప్రసంగించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి ఖేహర్ మాట్లాడుతూ, “భారత విభజన సమయంలో, పంజాబ్‌లో హిందువులు, సిక్కులు తమను తాము రక్షించుకోవడానికి, సహాయక చర్యలు చేపట్టడానికి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద కార్యకర్తలు ఎంతో సహాయపడ్డారు” అని పేర్కొన్నారు.
1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో సిక్కు కుటుంబాలను కాపాడటంలో సంఘ్ కార్యకర్తలు క్రియాశీల పాత్ర పోషించారని, ఆర్ఎస్ఎస్ అధికారిక ప్రచురణలు, దివంగత రచయిత ఖుష్వంత్ సింగ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారని ఆయన గుర్తు చేశారు. “దాడులకు గురయ్యే అవకాశం ఉన్న నివాస ప్రాంతాల వద్ద వారు కాపలా కూడా కాశారు. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత, చరిత్రకారుడు ఖుష్వంత్ సింగ్ కూడా ధృవీకరించారు” అని ఖేహర్ చెప్పారు.
కేవలం పదిహేను నుండి ఇరవై మంది యువకులతో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా ఎదగడం తనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోందని ఆయన తెలిపారు. “గత వంద ఏళ్లుగా మీరు అనేక సామాజిక, రాజకీయ మార్పులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, మీరు ఒక సాంస్కృతిక, సామాజిక , జాతీయవాద సంస్థగానే కొనసాగుతున్నారు” అని ఖేహర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర సీనియర్ మంత్రులతో సహా బీజేపీ అగ్రనేతలందరూ పాల్గొన్నారు.

More Stories
భారత ఆత్మ అంతర్గతంగా మేల్కొంటుంది
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత
మాదకద్రవ్యాల వినియోగం, దుర్వినియోగం ఓ ప్రధాన సవాల్