వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం జఠిలమైన సమస్య అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండవ రోజైన మంగళవారం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కుమారస్వామి, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరిలతో సమావేశమయ్యారు.
అనంతరం జరిగిన విలేకరలు సమావేశంలో మాట్లాడుతూ ‘కొన్ని ఇబ్బందులున్నాయి. వాటిని ఎలా పరిష్కరించాలి? ఎలా శాశ్వత పరిష్కారం చేయాలి? అని ఆలోచిస్తున్నాం. ఇది ఒక మనోభావాలకు సంబంధించిన అంశం.’ అని తెలిపారు.’స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలంటే, సెయిల్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలి. అదే పెద్ద సమస్యగా ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ ఆగాలన్నా చాలా నిధులు కావాలి. ఎన్‌ఎండిసి ఇచ్చే నిధులు ఏ మూలకూ చాలవు’ అని ఆయన చెప్పారు.
‘జఠిలమైన సమస్యలన్నింటిని పరిష్కారం చేసుకున్నాం. ఇప్పుడు ఇది ప్రధానంగా వచ్చింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో వాటి గురించి చర్చించాను. గతంలో ఈ విషయమై దృష్టి పెట్టకుండా నష్టాల్లోకి నెట్టేశారు’ అని విమర్శించారు. ‘స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిగా పునరుద్ధరించడానికి ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం.’ అని చెప్పారు.
స్టీల్ ప్లాంటును సక్రమంగా నడవనీయకుండా చూడటానికి కొందరు అనేక విధాలుగా ప్రయత్నించారని ఆరోపించారు. ‘ఎవరు ఏ విధంగా ప్రయత్నించారో నా వద్ద పూర్తి సమాచారం లేదు. అడ్మినిస్ట్రేషన్ విఫలం కావడం కావచ్చు. లేకపోతే కొన్ని నిర్ణయాలు కూడ కారణం కావచ్చు ఏదైనా స్టీల్‌ప్లాంట్ సమస్యల్లో పడింది’ అని ఆయన తెలిపారు.
భూమిని ఇస్తే ఎన్‌ఎండిసి చేసే కొంత ఆర్థిక సాయం చేస్తుందని, అయితే అది తాత్కాలికమే అవుతుందని చెప్పారు. ‘ఆ సాయం చాలదు. దాంతో స్టీల్‌ప్లాంట్ పునరుద్ధరణ జరగదు’ అని చెప్పారు. దీనికి ఒక ప్యాకేజీ ఇచ్చేటట్లు ఆలోచిస్తే తప్ప పునరుద్ధరించలేం అని స్పష్టం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ముడి సరుకు కూడా లేదని, అది కూడా సమస్యేనని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌పై తర్వలో శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
కాగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు గురించి ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేసినట్లు సిఎం చెప్పారు. గత ఐదేళ్లలో కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని ప్రధానికి వివరించానని తెలిపారు. పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని కోరినట్లు చెప్పారు.
రూ.84 వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ పెడుతున్నారని, దానికి స్థలం గుర్తిస్తున్నారని తెలిపారు. దీనికోసం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపాడు ప్రాంతాల్లో చూస్తున్నారని, తాను కృష్ణపట్నం కూడా పరిశీలించాలని చెప్పినట్లు తెలిపారు. లక్ష కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ కోసం ఏపి జెన్‌కో, ఎన్‌పిహెచ్‌సి ఒప్పందం చేసుకున్నాయని, ఈ ప్రాజెక్టును తొందరిలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
వచ్చే నెలలో విశాఖపట్నంలో భూమి పూజ చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల పెండింగ్ పనులు పూర్తి చేయాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్యాస్ రాయితీ గురించి వివరించానని, డిసెంబరు నుంచి అమరావతిలో రోడ్లు, ఇతర నిర్మాణాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఫోర్ లైన్లు వేయాలని రైల్వే మంత్రిని కోరానని, అమరావతి నుంచి విజయవాడ రైల్వే లైను కోరానని చంద్రబాబు చెప్పారు. మచిలీపట్నం నుంచి రేపల్లెకు రైల్వే లైన్ కనెక్ట్ చేయాలని కోరానని, నరసాపురం- మచిలీపట్నం, రేపల్లె-బాపట్ల లైన్లు ఇవ్వాలని కోరిననట్లు చెప్పారు.
దక్షిణ భారత్ లో నాలుగు ముఖ్యమైన నగరాలను (హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు) అనుసంధానం చేసేలా బుల్లెట్ రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అమరావతి నగరాలు కలిసేలా బుల్లెట్ రైళ్లు నడపడానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయని ఆయన చెప్పారు.
దీని కోసం ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ వేయాల్సి ఉంటుందని, పూర్తి ప్రతిపాదనలు సిద్ధమైన తర్వాత రైల్వే శాఖ వివరాలు వెల్లడిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నాలుగు ఎకానమిక్ హబ్‌లను కవర్ చేస్తూ బుల్లెట్ రైలు పెడితే ఆర్థికపరమైన కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయని చెప్పానని తెలిపారు.
More Stories
హైడ్రామా మధ్య అధికారిని కొట్టిన స్వతంత్ర అభ్యర్థి అరెస్ట్
మతమార్పిళ్లకు పాల్పడే, అభివృద్ధిని అడ్డుకొనే ఎన్జీవోల ఎఫ్సిఆర్ఏపై కన్నెర్ర
త్వరలోనే నీటితో నడిచే హైడ్రోజన్ రైలు