దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రె్‌సకు ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దశాబ్దాల తరబడి ఆ పార్టీకి అధికారం ఇవ్వకుండా దూరం పెడుతుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మంగళవారం హరియాణా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మోదీ మాట్లాడారు.
భారత ఆర్థిక వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా పలుచన చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ప్రధాని ఆరోపించారు. చివరికి ఎన్నికల కమిషన్ వంటి సంస్థపై కూడా నిందలు వేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కులగణన పేరుతో ప్రజల మధ్య చీలిక తెచ్చేందుకు, ఎస్సీ, ఎస్టీలను, రైతులను, యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
కానీ, హరియాణా ప్రజలు కాంగ్రెస్ దేశవ్యతిరేక చర్యలను తిప్పికొట్టేలా తీర్పునిచ్చారని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు పూర్తి అంకితభావంతో ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ, అభివృద్ధి అజెండాను ప్రజల వద్దకు తీసుకెళ్లటం వల్లే హరియాణాలో చరిత్రాత్మక విజయం దక్కిందని తెలిపారు.
ఇక జమ్ముకశ్మీర్ ఫలితం భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సాధించిన విజయమని ప్రధాని అభివర్ణించారు. అక్కడ బీజేపీ అత్యధిక ఓట్లు సాధించిందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలోనూ సుదీర్ఘకాలం ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని మోదీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ.. ఇతర పార్టీలపై ఆధారపడే పరాన్నజీవిగా మారిందని, చివరికి ఆ పార్టీలనే మింగేస్తుందని ధ్వజమెత్తారు.
1966లో హర్యానా రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగగా అధికారంలో ఉన్న పార్టీ తిరిగి గెలుపొందడం జరగలేదని, మొదటిసారిగా బిజెపి వరుసగా మూడుసార్లు గెలుస్తూ వస్తున్నదని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. మొదటిసారిగా ఒక పార్టీకి పదేళ్లు అధికారంలో పూర్తిచేసుకొని వరుసగా మూడోసారి అధికారం చేపట్టే అవకాశం ఇచ్చారని చెబుతూ ఈ విజయం ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్‌లో కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకున్న నేషనల్ కాన్ఫరెన్స్ కూడా హస్తం పార్టీ కారణంగా తమ అవకాశాలు ఎక్కడ దెబ్బతింటాయోనని భయపడిందని మోదీ పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో బిజెపికి అత్యధికంగా ఓట్లు లభించాయని తెలిపారు. అక్కడి విజయం భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగంలది అని కొనియాడారు. కాగా, హరియాణాలో బీజేపీ గెలుపు కోసం అలుపెరగకుండా శ్రమించిన కార్యకర్తలందరికీ అభినందలు తెలియజేస్తున్నానని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్‌లో అధికారం సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు అభినందనలు తెలిపారు. అయితే, ఆ పార్టీ భాగస్వామ్యపక్షం కాంగ్రెస్ ను మాత్రం తన ట్వీట్‌లో ప్రస్తావించకపోవటం గమనార్హం. జమ్మూకశ్మీర్‌లో బీజేపీ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. హరియాణా ప్రజలు మోదీ నాయకత్వంలో అభివృద్ధి ఎజెండాను విశ్వసించి బీజేపీని గెలిపించారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు.
More Stories
అమిత్ షాపై కెనడా ఆరోపణలపై భారత్ అసంతృప్తి
మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం కచ్చితం
పోలింగ్ కన్నా ముందే అమెరికాలో సగంకు పైగా ఓట్లు