జాతీయ రహదారులపై క్లీన్‌ టాయిలెట్స్‌, బేబీ కేర్‌ రూమ్స్‌

జాతీయ రహదారులపై క్లీన్‌ టాయిలెట్స్‌, బేబీ కేర్‌ రూమ్స్‌

దేశవ్యాప్తంగా జాతీయ రహదాని నెట్‌వర్క్‌లో కొత్తగా మరికొన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారి కోసం క్లీన్‌ టాయిలెట్స్‌, బేబీ కేర్‌ రూమ్స్‌ తదితర అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం ‘హమ్‌సఫర్‌ పాలసీ’ని ప్రారంభించారు. 

ఈ పాలసీలో క్లీన్‌ టాయిలెట్స్‌, బేబీ కేర్‌ రూమ్స్‌, వీల్‌చైర్స్‌, ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌, పార్కింగ్‌ ప్లేస్‌, ఫ్యూయల్‌ స్టేషన్లలో హాస్టల్‌ తదితర సేవలను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విధానంలో హైవే వాహనదారులకు అనుకూలమైన, సురక్షితమైన, ఆనందదాయకమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొంది. 

అలాగే, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంతో పాటు ఉపాధిని సృష్టించడంతో పాటు కొత్తగా ఉద్యోగులు కల్పించి జీవనోపాధిని పెంచుతుందని పేర్కొన్నారు.  కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ హమ్‌సఫర్‌ బ్రాండ్‌ దేశంలోని ప్రపంచస్థాయి హైవే నెట్‌వర్క్‌లో ప్రయాణికులు, డ్రైవర్లకు అత్యంత భద్రతతో పాటు సౌకర్యాలకు పర్యాయపదంగా మారుతుందని తెలిపారు. 

జాతీయ రహదారులపై నాణ్యమైన, ప్రామాణికమైన సేవలను అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మా హైవే నెట్‌వర్క్‌లో అత్యున్నత స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని గడ్కరీ చెప్పారు. ఈ పాలసీని సిద్ధం చేసే సమయంలో నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ, వ్యర్థాల పునర్వినియోగం, సౌరశక్తి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకున్నట్లు ఆయన తెలిపారు. 

జాతీయ రహదారుల వెంబడి ఉన్న పెట్రోల్ పంపుల యజమానులు పెట్రోల్ పంపుల వద్ద నిబంధనల ప్రకారం.. కనీస సౌకర్యాలు కల్పించాలని మంత్రి కోరారు. హైవేల పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకుల్లో తప్పనిసరిగా మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచి ప్రజలు వినియోగించుకునేలా చూడాలని చెప్పారు. చాలా పెట్రోల్‌ పంపుల వద్ద టాయిలెట్స్‌ మూసివేయడం తాను చూశానని పేర్కొంటూ అలా చేయకపోతే బంకులు మూసివేసేందుకు అవకాశం ఉండవచ్చని హెచ్చరించారు.