రేషన్ కార్డుల కోసం ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస కార్మికులకు కార్డుల జారీలో జాప్యం చేస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర సహనం వ్యక్తం చేసింది. రాష్ట్రాల తీరు ఆందోళనకరమని, ఈ విషయంలో తాము సహనం కోల్పోయామని, ఓపిక నశించిందని, ఇదే మీకు చివరి అవకాశమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం అర్హులైన వలస కార్మికులకు రేషన్ కార్డుల మంజూరులో జాప్యాన్ని తీవ్రంగా పరిగణించింది. నవంబర్ 19 లోగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల (యుటిలు) ప్రభుత్వాలకు తుది అవకాశం ఇచ్చింది.
చర్యలు లేని పక్షంలో కోర్టు ధిక్కార నేరం కింద డిఫాల్ట్ రాష్ట్రాల కార్యదర్శులకు సమన్లు పంపుతామని ధర్మాసనం హెచ్చరించింది. తాము సహనం కోల్పోయామని, ఇక భోగము ఉండదని స్పష్టం చేసింది. ”ఈ అంశంలో ఎలాంటి ఉదాసీనతకు చోటు లేదని మరోసారి స్పష్టంగా చెబుతన్నాం. ఇక మాకు ఓపిక నశించింది. మా ఉత్తర్వులను పాటించేందుకు మీకు చివరి అవకాశం ఇస్తున్నాం. లేదంటే ఈ కార్యదర్శలు కోర్టుకు రావాల్సి ఉంటుంది” అని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.
కేంద్ర ప్రభుత్వం తరపు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ ”రాష్ట్రాలు స్పందించాలి. కట్టుబడి ఉండాలి. ఇది డైనమిక్ ప్రక్రియ” అని పేరొకన్నారు. అంత్యోదయ అన్న యోజన (సమాజంలోని నిరుపేద వర్గాలకు రేషన్ పంపిణీ పథకం) కింద ప్రాధాన్యత కలిగిన ప్రతి ఇంటికి ఒక రేషన్ కార్డు మాత్రమే జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన ఇతర సభ్యులకు కార్డులు జారీ చేయకపోవడం కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లేనని ధర్మాసనం పేర్కొంది. అర్హులైన వలస కార్మికులకు ఇంకా జారీ చేయని రేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని ప్రభుత్వాలను హెచ్చరించామని అశ్వర్య భాటి పేర్కొన్నారు.
దీనికి జస్టిస్ అమానుల్లా ”ఇదేనా కేంద్ర ప్రభుత్వ శ్రద్ధ? ఇదేనా మీ సీరియస్‌నెస్? పేదలలోని నిరు పేదల గురించి. క్యాబినెట్ సెక్రటరీ సమావేశాలు ఎందుకు నిర్వహించలేరు? ఎందుకంటే ఇది వారికి ముఖ్యం కాదు?” అని ఆక్షేపించారు. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 19న జరగనుందని, ఆ లోపు చర్యలు తీసుకోవాలని సూచించింది.
వలస కార్మికులకు రేషన్‌కార్డులు అందించాలన్న ఏడాది నాటి ఆదేశం ఇంకా అమలు కాలేదని పేర్కొన్న ధర్మాసనం, రెండు నెలల్లోగా పేర్కొన్న కసరత్తును పూర్తి చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ , సామాజిక కార్యకర్తలు అంజలి భరద్వాజ్, అమృతా జోహ్రీలు ఈ కేసులో వలస కార్మికుల తరపున వాదించారు.
కరోనా సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు 2020 మే 26న దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా ఈ-శ్రమ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికులకు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం రేషన్ కార్డులు జారీ చేయాలని 2021లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది.
అయితే ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తిగా చేయగా, మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాప్యం చేస్తున్నాయని, దీంతో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
కశ్మీర్లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు