వర్షాలు, వరదల వల్ల 1,492 మంది మృతి

వర్షాలు, వరదల వల్ల 1,492 మంది మృతి

ఈ ఏడాది వర్షాకాలంలో ఊహించని విధంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. వాతావరణ శాఖ అంచనాకు మించి కూడా వర్షాలు కురిశాయి. ఈ విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల అత్యధిక మరణాలు సంభవించాయి. మొత్తంగా ఈ ఏడాది వర్షాలు, వరదల వల్ల 1,492 మంది మృతి చెందినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

ఐఎండి లెక్కల ప్రకారం.. వర్షాలు, వరదల వల్ల 895 మంది మృతి చెందగా, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల కారణంగా 597 మంది మృతి చెందారు.
ఈ ఏడాది (2024)లో భారీ వర్షపాతం (115.6 మిల్లీ మీటర్ల నుండి 204.5 మిల్లీమీటర్ల మధ్య) నమోదైంది. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని ఐఎండి తెలిపింది. 

ఈ సీజన్‌ ప్రారంభంలో వడగాలుల కారణంగా 17 మంది మృతి చెందారు. జార్ఖండ్‌లో 13, రాజస్థాన్‌లో నలుగురు చనిపోయారు. జూలై 30వ తేదీన కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. అప్పుడు భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి విలయానికి 397 మంది మృతి చెందారు. అలాగే వర్షాలు, వరదలు కారణంగా అస్సాం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో 102, 100 మంది మృతి చెందారు. దేశ రాజధానిలో 13 మంది మృతి చెందారు.

ఉరుములు, పిడుగుల కారణంగా మధ్యప్రదేశ్‌లో అత్యధిక మరణాలు సంభవించాయి. దేశంలో రికార్డుస్థాయిలో ఈ రాష్ట్రంలో 189 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ 138, బీహార్‌ 61, జార్ఖండ్‌ 53 మరణాలు సంభవించాయి. 2024 నైరుతి రుతుపవనాల సీజన్‌ (సెప్టెంబర్‌ 30) సోమవారంతో ముగిసింది. ఈ సీజన్‌లో భారత్‌లో 934.8 మి.మీ వర్షపాతం నమోదైంది. 

2020 నుండి దీర్ఘకాల సగటులో 107.6 శాతం వర్షపాతం అత్యధికంగా నమోదైందని ఐఎండి తెలిపింది. మధ్య భారతంలో 19 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. దక్షిణ ద్వీపకల్పంలో సాధారణం కంటే 14 శాతం ఎక్కువ. వాయువ్య భారతదేశంలో సాధారణ కంటే 7 శాతం ఎక్కువ నమోదైంది. తూర్పు, ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే 14 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండి తెలిపింది.