కోల్ కతాలో ట్రెయినీ డాక్టర్ అత్యాచారం ఘటన తర్వాత ఆందోళన చేపట్టిన జూనియర్ డాక్టర్లు వారం కిందట తాత్కాలికంగా నిరసన విరమించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీతో నిరసన విరమించిన వైద్యులు.. తాజాగా మళ్లీ ఆందోళన బాట పట్టారు. మంగళవారం నుంచే విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ఆసుపత్రులలో తమకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. సాగోర్ దత్తా మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో ఓ వైద్యుడిపై దాడి జరగడంతో ఆందోళన చేపట్టారు. ఈసారి ఆందోళనను మరింత తీవ్రంగా చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అత్యవసర సేవలు సహా అన్ని సేవలకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించారు.
ఆర్జీ కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం నేపథ్యంలో పనిచేసే చోట తమకు రక్షణ లేకుండా పోయిందని వైద్యులు వాపోతున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు మహిళా వైద్యుల భద్రత, డాక్టర్లపై దాడులను అరికట్టేందుకు రక్షణ ఏర్పాట్ల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆందోళన చేపట్టిన వైద్యులతో అప్పట్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చలు జరిపారు. ఆసుపత్రులలో మహిళా వైద్యుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, ఆసుపత్రులలో సీసీటీవీ కెమెరాల ఏర్పాట్లు తదితర ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైద్యులు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. అయితే, తాజాగా సాగోర్ దత్తా ఆసుపత్రిలో వైద్యుడిపై దాడి జరగడంతో మళ్లీ ఆందోళన చేపట్టారు.
బుధవారం (అక్టోబర్ 2) భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. జూనియర్ వైద్యులు బుధవారం సెంట్రల్ కోల్‌కతాలోని కాలేజ్ స్క్వేర్ నుంచి ధర్మతల వరకు మార్చ్‌కు పిలుపునిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ మార్చ్‌లో తమతో కలిసి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమకు ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వైద్యులు ఆరోపించారు. దీంతో విధులను బహిష్కరించడం మినహా తమకు మరో మార్గంలేకుండా పోయిందని చెప్పారు. అవినీతి, విధుల్లో అలసత్వం చూపిన రాష్ట్ర వైద్య ఆరోగ్య కార్శదర్శిని తొలగించాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో డిజిటల్ బెడ్ వేకెన్సీ మానిటరింగ్ సిస్టమ్, సెంట్రల్ రిఫరల్ సిస్టమ్, సీసీటీవీ, ఆన్ కాల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆస్పత్రుల్లో పోలీసు రక్షణను పెంచాలని, అలాగే శాశ్వతంగా మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, హెల్త్ కేర్ వర్కర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారు.
More Stories
మెరీనా బీచ్ వద్ద ఎయిర్ షోలో తోక్కిసలాట.. ఐదుగురు మృతి
ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్లకే శబరిమల అయ్యప్ప దర్శనం
నాల్గోతరం ష్టార్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రయోగం