తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్తాన్ ఆర్థిక నియంత్రణ దిశగా చర్యలు చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా రుణం పొందకపోతే ఇక ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి పాకిస్తాన్ చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఎఫ్) నుండి రుణం పొందడానికి సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
ఇందుకుగాను దేశంలో ఆర్థిక వ్యయాలను తగ్గించేందుకు 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు కోత పెట్టింది. అలాగే ఆరు మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసింది. దీంతో పాటు మరో రెండు మంత్రిత్వ శాఖల విలీనాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాక్‌కు 7 బిలియన్ డాలర్లు లోన్ ఇచ్చేందుకు ఐఎంఎఫ్ సిద్ధమైంది. తొలి విడతగా 1 బిలియన్ డాలర్లను విడుదల చేసింది.
ఐఎంఎఫ్ ప్యాకేజీపై పాక్ ఆర్థిక శాఖ మంత్రి మహమ్మద్ ఔరంగజేబు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఐఎంఎఫ్ నుంచి ఇదే ప్రభుత్వ చివరి ప్యాకేజీ అని నిరూపించేలా తమ విధానాలను అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచాలని చెప్పారు.
తద్వారా జీ 20 కూటమిలో చేరడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా ఆరు మంత్రిత్వ శాఖలను తొలగిస్తున్నామని ప్రకటించారు. రెండు మంత్రిత్వ శాఖలు వేరే దాంట్లో విలీనం కానున్నాయని పేర్కొన్నారు. వివిధ మంత్రిత్వ శాఖల్లో లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగులను తీసేస్తున్నామని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య 32 లక్షలకు పెరిగిందని, గతంలో ఈ సంఖ్య 16 లక్షలుగా ఉండేదని చెప్పారు. పన్నులు చెల్లించని వారు ఇకపై ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయలేరు అని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ విధానాలను పటిష్టపరుస్తామని అన్నారు.
More Stories
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
రూ.1,800 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఎన్నికల బాండ్ల పథకంపై తీర్పు సమీక్షకు `సుప్రీం’ నిరాకరణ