సిద్ధరామయ్యపై ఈడీ కేసు .. ప్లాట్ల ఇచ్చివేతకు భార్య సుముఖత

సిద్ధరామయ్యపై ఈడీ కేసు .. ప్లాట్ల ఇచ్చివేతకు భార్య సుముఖత
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చర్యలు చేపట్టింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, ఆయనకు భూమిని అమ్మిన దేవరాజుపై సెప్టెంబర్‌ 27న మైసూరు లోకాయుక్త నమోదు చేసిన కేసును ఈసీ పరిగణనలోకి తీసుకున్నది.
 
కాగా, ఈ కేసు నమోదు చేసిన కొద్దీ గంటలకే తనకు ముడా కేటాయించిన 14 ప్లాట్లను తిరిగి ఇచ్చివేసేందుకు సిద్దరామయ్య భార్య పార్వతి సుముఖత వ్యక్తం చేశారు. ఆ మేరకు ముడా కమిషనర్ కు ఆమె లేఖ వ్రాసారు. తమ నుండి స్వాధీనం చేసుకున్న 3 ఎకరాల 16 కుంటల స్థలానికి బదులుగా వివిధ ప్రాంతాలలో కేటాయించిన ఈ ప్లాట్లను తిరిగి ఇచ్చి వేస్తున్నట్లు ఆ లేఖలో ఆమె తెలిపారు.
 
ఈ నేపథ్యంలో వారిపై ఈడీ కేసు నమోదుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు సమాచార నివేదిక (ఈసీఐఆర్‌)ను దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్లను ఈసీఐఆర్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితులకు ఈడీ సమన్లు జారీ చేసి ప్రశ్నించడంతోపాటు  వారి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది.

కాగా, సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి ఆమె సోదరుడు బహుమతిగా ఇచ్చిన భూమిని ముడా సంస్థ స్వాధీనం చేసుకున్నది. ఆ భూమికి బదులుగా కోట్ల విలువైన 14 ప్లాట్లను ఆమెకు కేటాయించింది. ఇందులో భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్లు కర్ణాటకలోని ప్రతిపక్షమైన బీజేపీ ఆరోపించింది. దీంతో సీఎం సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు.

మరోవైపు గవర్నర్‌ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. అనంతరం లోకాయుక్త పోలీసుల విచారణకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు కూడా గత వారం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, బావమరిది, భూమిని అమ్మిన వ్యక్తిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ కూడా సోమవారం కేసు నమోదు చేసింది.

ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని, ఇందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టి.జె అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అతడితోపాటుగా స్నేహమయి కృష్ణ, ప్రతీప్ కుమార్‌ కూడా సీఎంపై ఫిర్యాదు చేశారు. దానితో ఆగస్టు 16న ముఖ్యమంత్రిని విచారించాలని గవర్నర్ ఆదేశించారు.

అయితే మరోవైపు ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. దానిని గవర్నర్ తోసిపుచ్చగా విషయం న్యాయస్థానానికి చేరుకుంది. దీనిపై కోర్టు కీలక తీర్పునిచ్చింది. సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ ఆదేశించడం చట్టబద్ధమేనని వ్యాఖ్యానించింది. లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. తర్వాత సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు.