
పొరుగు దేశం నేపాల్ లో వరద బీభత్సం కొనసాగుతోంది. శుక్రవారం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తూర్పు, మధ్య నేపాల్‌లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఈ వరదలకు రాజధాని ఖాట్మండు సహా ఎనిమిది జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ జల ప్రళయానికి దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 68 మంది గల్లంతవ్వగా.. వంద మందికి పైగా గాయపడ్డారు. గల్లంతయిన వారికి కోసం రెస్క్యూ బృందాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.
నేపాల్‌లో వరదలు, కొండచరియలు వల్ల కనీసం 192 మంది చనిపోయి ఉంటారని హోంమంత్రిత్వశాఖ ప్రతినిధి రిషిరామ్ తివారీ తెలిపారు. అలాగే 194 మంది గాయాలపాలయ్యారు. ఇక ఈ ప్రకృతి విపత్తుకు సంబంధించి ఆదివారం సింఘా దర్బార్‌లోని ప్రధాని కార్యాలయంలో నేపాల్ ప్రధానమంత్రి ప్రకాశ్ మన్‌సింగ్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
విపత్తు సమయంలో రెస్క్యూ ఆపరేషన్స్‌ని మరింత పెంచాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రదేశాల్లో నేపాల్ ఆర్మీ, పోలీసులు, సాయుధ పోలీసు సిబ్బంది మొత్తం 4,500 మంది రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగమై ఉన్నారని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వెళ్లే కూరగాయల్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో అక్కడ మార్కెట్‌లో వాటి ధరలు విపరీతంగా పెరిగాయి.
దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్లు, వందలాది ఇళ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వందలాది కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. నేపాల్ రాజధాని ఖాట్మాండుకు వెళ్లే అన్ని మార్గాలు బ్లాక్ చేశారు. దీంతో వేలాది మంది ప్రయాణీకులు చిక్కుకుపోయారని ‘ఖాట్మాండు పోస్టు’ అనే వార్తా పత్రిక తెలిపింది. రవాణాను తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రిత్వశాఖ అధికారి తివారీ తెలిపారు.
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల 1100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కనీసం 20 జలవిద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. దీంతో ఖాట్మాండుతోపాటు పలు ప్రధాన నగరాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడింది. ఆసియాలో సంభవించిన వాతావరణ మార్పుల వల్లే అత్యధిక వర్షపాతం నమోదవ్వడానికి కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఇక ఈ వరదలకు భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. వెయ్యికిపైగా ఇళ్లు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. భాగమతి నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. దేశవ్యాప్తంగా 44 జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ కారణంగా రోడ్లు ధ్వంసమవడంతో.. 39 జిల్లాల్లో రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. దాదాపు 3 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇప్పటి వరకు వెయ్యి మంది వరకు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
More Stories
దక్షిణాది బలోపేతం కాకుండా ‘వికసిత్ భారత్’ సాధ్యం కాదు
విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం తోనే తొక్కిసలాట
బలూచిస్తాన్ ‘ఆపరేషన్ బామ్’ తో మళ్లీ ఉద్రిక్తతలు