రైతు రుణమాఫీ వివరాలను ప్రజా పోర్టల్‌లో పెట్టాలి

రైతు రుణమాఫీ వివరాలను ప్రజా పోర్టల్‌లో పెట్టాలి
 
* బిజెపి ప్రజా ప్రతినిధుల రైతు హామీల సాధనా దీక్ష
 
రైతు రుణమాఫీ వివరాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పోర్టల్‌లో పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతు హామీల సాధన కోసం బీజేపీ ప్రజా ప్రతినిధులు హైదరాబాద్‌ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్లో రైతు హామీల సాధన దీక్ష పేరుతో సోమవారం 24 గంటల దీక్ష చేపట్టారు.

బిజెపి శాసనసభా పార్టీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి నేతృత్వంలో జరిగిన దీక్షలో ఆ పార్టీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే.అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్‌, గోడెం నగేష్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పాల్వాయి హరీష్ బాబులు దీక్షలో పాల్గొన్నారు. 

రైతులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలుపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఒకే సంతకంతో రాష్ట్రంలోని 70లక్షల మంది రైతన్నలకు రుణమాఫీ చేస్తానని చెప్పారని, కానీ 22 లక్షల మందికి మాత్రమే చేసి మిగిలిన రైతులను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రూ.40వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పి, ఆ తర్వాత కేబినెట్ మీటింగ్ లో రూ.31వేల కోట్లతో రుణమాఫీ అని ప్రకటించి, బడ్డెట్ లో రూ.26వేల కోట్లు మాత్రమే కేటాయించి, చివరికి రుణమాఫీ కోసం కేవలం రూ.17,933కోట్లు మాత్రమే రుణమాఫీకి ఖర్చు చేశారని ఆయన గుర్తు చేశారు.  రైతులను మోసం చేస్తూ, రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాడుదామని పిలుపిచ్చారు.  రానున్న రోజుల్లో ప్రజాగొంతుకై ప్రజలకోసం పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి,  రైతులను బ్యాంకులకు వెళ్లి అప్పు తెచ్చుకోమని చెప్పి ఇప్పుడు ఎందుకు మాఫీ చేయడం లేదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ రైతు బంధు అంటే కాంగ్రెస్ రైతు భరోసా అని 15 వేలు ఇస్తామని చెప్పిఇప్పటి వరకు ఇవ్వలేదని ఆమె విమర్శించారు.

రేవంత్ రెడ్డికి దమ్ముంటే రుణమాఫీ ఎంత చేశారో ప్రజా పోర్టర్‌లో పెట్టాలని ఎంపీ ఈటల రాజేందర్‌ సవాల్ చేశారు. ఆరు గ్యారంటీలలో ఒక్క ఉచిత బస్సు తప్ప ఏమీ అమలు కాలేదని ధ్వజమెత్తారు.  రుణమాఫీ చేయకుంటే నీ భరతం పట్టుడు ఖాయం అని ముఖ్యమంత్రిని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పక్కకుపెట్టి హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తోందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ మరచిపోయిందేమో కానీ రైతులు, బిజెపి పార్టీ మరచిపోలేదని హెచ్చరించారు.  అధికారం పదేళ్లలో బీఆర్ఎస్ ఎంత అపఖ్యాతి మూటకట్టుకుందో పది నెలల్లో కాంగ్రెస్ అంతే మూటకట్టుకుందని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం రైతులే. చివరికి రైతులనే మోసం చేస్తోందని ధర్మపురి అర్వింద్ తెలిపారు. రాష్ట్రంలో కేవలం 20శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి 80శాతం మంది రైతులను మోసం చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అనేక హామీలిచ్చి, నేడు గారడీలు చేస్తోందని తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. 

మంగళవారం ఉదయం 11 గంటల వరకు బీజేపీ ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష కొనసాగనుంది. దీక్షకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆ పార్టీ నాయకులు తరలి వచ్చి సంఘీభావం తెలిపారు.

“కాంగ్రెస్ అధికారంలో వచ్చాక వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే రుణమాఫీ ఎంత చేశారో ప్రజా పోర్టర్‌లో పెట్టాలి. రుణమాఫీ పూర్తిగా సాధ్యం కాదని తెలిసి కూడా హామీలు ఇచ్చారు. ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి చేసే సత్తా కాంగ్రెస్‌కు లేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే పూర్తిగా అమలు చేశారు.మాట ఇస్తే తప్పని వ్యక్తి ప్రధాని మోదీ మాత్రమే” అంటూ బిజెపి నేతలు విమర్శలు గుప్పించారు.