స్థానికత వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వందే  నిర్ణయం

స్థానికత వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వందే  నిర్ణయం

స్థానికత వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, నిబంధనలు రూపొందించే హక్కు రాష్ట్రాలకే ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నీట్‌ కౌన్సెలింగ్‌ స్థానికత వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై ఈ మేరకు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం జిఓ 33ను తీసుకొచ్చింది. నీట్‌కు ముందు నాలుగేళ్లు లోకల్‌గా చదవాలని, లేదా ఉండాలని జిఓ 33లోని నిబంధన 3 (ఏ) కింద చేర్చింది. అయితే ఈ నిబంధనను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కల్లూరి నాగ నరసింహా అభిరామ్‌తోపాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు విద్యార్థులకు సానుకూలంగా తీర్పు వెలువరిం చింది. ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవీ రూపొందించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని స్పష్టం చేసింది. 

ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల మేరకు ప్రతి విద్యార్థికి స్థానిక కోటా వర్తింపజేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత విచారణ సందర్భంగా ఒకసారి మినహాయింపు కింద హైకోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 

దీంతో ఈ 135 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పించడంతో పాటు, హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు సిజెఐతో కూడిన బెంచ్‌ మధ్యంతర స్టే ఇచ్చింది. అలాగే ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. అయితే సోమవారం మరోసారి ఈ పిటిషన్‌ను సిజెఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. 

విద్యార్థుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కేవలం హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులను మాత్రమే కౌన్సెలింగ్‌కు అనుతించడం సరికాదని తెలిపారు. తెలంగాణకు చెందిన అర్హులందరినీ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కోరారు. కేవలం ఒకటి లేదా రెండేళ్లు వేరే చోట చదివినంత మాత్రాన స్థానికులు కాదనడం భావ్యం కాదన్నారు. 

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం మొత్తం ఎంతమంది విద్యార్థులు ఇలా స్థానికత సమస్యను ఎదుర్కొంటున్నారని ప్రశ్నించింది. స్థానికత అంశంపై స్పష్టమైన విధానం ఉండాలని పేర్కొంది. నీట్‌ కౌన్సెలింగ్‌లో స్థానికత వ్యవహారంపై అందరికీ వర్తింపజేస్తే ఎలా ఉంటుందనే అంశంపై లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. అక్టోబరు 3న మరోసారి విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.