సీఎం రేవంత్ రెడ్డికి ఎంఐఎం సవాల్
‘హైడ్రా హటావో.. ఘర్ బచావో’ నినాదం పాతబస్తీలో మార్మోగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హైడ్రాలకు వ్యతిరేకంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకులు బహదూర్‌పుర, కిషన్‌బాగ్‌లో సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఒక వంక హైకోర్టు మొట్టికాయలు వేయడం, బాధితులు పెద్ద సంఖ్యలో నిరసనలు చేపట్టడం, కాంగ్రెస్ లోని పలువురు నాయకులు సహితం అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేతలపై వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.
ఈ సందర్భంగా బహదూర్‌పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ మాట్లాడుతూ పాతబస్తీలోకి బుల్డోజర్లు వచ్చే దమ్ముందా? వస్తే తామేంటో చూపిస్తామని అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం మొండిగా ఇండ్లను కూల్చడానికి యత్నిస్తే బుల్డోజర్ల ముందు తాము నిలబడతామని సవాల్ విసిరారు. ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని చెప్పారు.
ఎలాంటి నష్టపరిహారం, ప్రత్యామ్నాయ నివాసం ఏర్పాటు చేయకుండా రేవంత్ సర్కార్ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని విమర్శించారు. హైదరాబాద్ కలెక్టర్‌తో చర్చించామని, 2003లో మూసీ నది ఫిజికల్ సర్వే ప్రకారం స్వాధీనం చేసుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులకు మద్దతుగా ఆందోళన చేసిన కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఎంఐఎం నాయకులు వెళ్లాక విడుదల చేశారు. హైడ్రా ఏర్పాటు నుంచి ఎంఐఎం పార్టీ వ్యతిరేక గళం వినిపిస్తూనే ఉన్నది.
పాతబస్తీలోని ఫాతిమా కాలేజీ కూల్చివేయాలని ప్రచారం జరగడంతో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. ‘కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. కత్తులతో దాడి చేయండి. కాలేజీలను మాత్రం కూల్చేయకండి’ అంటూ అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిర్ధాక్షిణ్యంగా పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా అధికారులను ఎంఐఎం ప్రాబల్యంగల పాతబస్తీలో అడుగు పెట్టమని బిజెపి నాయకులు బహిరంగంగానే సవాళ్లు చేస్తున్నారు.
సామాన్యుడి ఇల్లు కూల్చివేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు హడావిడిగా వ్యవహరించడం వల్లే ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నామని హైడ్రా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించే పద్ధతిలో తేడాలున్నాయనే చర్చ కూడా జరిగింది. ప్రధానంగా కోర్టులో హైడ్రాకు చుక్కెదురైన నేపథ్యంలో అమీన్‌పూర్ తహసీల్దార్, కలెక్టర్, హైడ్రా కమిషనర్, ఇలా అందరు ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ అవుతున్నారని, అసలు ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి హైడ్రాను ఇంతగా ప్రోత్సహించిన ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం స్టేట్‌మెంట్స్ తప్ప ఎక్కడా చిక్కక పోవడం గమనార్హం.
హైడ్రా వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం రెండుగా చీలిపోయి ఉన్నట్లు స్పష్టం అవుతుంది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ వంటి నేతలు హైడ్రాపై బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెల్లడించారు. సంగారెడ్డి జోలికి రావొద్దని జగ్గారెడ్డి హెచ్చరిస్తే, పేదల ఇండ్లను తొందరపడి కూల్చొద్దని అద్దంకి దయాకర్ సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సైతం అంతర్గత చర్చల్లో హైడ్రా వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైడ్రా చర్యలు పార్టీ, ప్రభుత్వాన్ని ముంచడం ఖాయమనే ఆందోళనను ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం
More Stories
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా గద్దలతో ‘ఈగల్ స్కాడ్’
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్