హర్యాణాలో మూడోసారి డబుల్ ఇంజన్ సర్కార్

హర్యాణాలో మూడోసారి డబుల్ ఇంజన్ సర్కార్

హర్యాణా బీజేపీలో అంతర్గత విభేదాలు లేవని ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ స్పష్టం చేశారు. ఇక్కడ బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అబద్ధాల దుకాణాన్ని(ఝూట్ కా దుకాణ్) ఎవరూ కోరుకోరని ఆయన ఎద్దేవా చేశారు. 

‘హరియాణా సంకల్ప్ యాత్ర’ పేరిట సోమవారం నుంచి పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై కూడా సైనీ విమర్శలు గుప్పించారు. ఆయన పొలిటికల్ టూరిజం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము పదేళ్లలో చేసిన అభివృద్ధిని ఆయన స్వాగతిస్తున్నారని పేర్కొంటూ భూపిందర్ హుడా హయాంలో అవినీతి, పక్షపాతం వల్ల ప్రజలకు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆయనకు ప్రశ్నలు ఎదురవుతాయిని సైనీ హెచ్చరించారు.

ఇద్దరు బీజేపీ సీనియర్ నాయకులు రావు ఇంద్రజిత్ సింగ్, అనిల్ విజ్ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇద్దరూ సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఐక్యంగానే ఉందని నాయబ్ సింగ్ సైనీ తేల్చి చెప్పారు. 

“మా మధ్య(బీజేపీలో) అంతర్గత విభేదాలు, కక్ష లేవు. మేమంతా ఐక్యంగా ఉన్నాము. మా సీనియర్ నాయకులు చురుకుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ. ఎవరైనా తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. పార్టీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి విబేధాలూ లేవు. ఇకపైనా ఉండవు. హర్యాణా ప్రజల్లో ఎలాంటి గందరగోళం లేదు. వారు డబుల్ ఇంజిన్ సర్కార్కు ఓటు వేయబోతున్నారు.” అని సైనీ చెప్పారు.

కాంగ్రెస్  ఒక విడిపోయిన ఇల్లు అని నాయబ్ సింగ్ సైనీ ధ్వజమెత్తారు. ఆ పార్టీలో సీనియర్ నాయకులకు కూడా విలువ ఇవ్వరని, అలాంటిది వారు ఇచ్చిన హామీలకు ఏం విలువ ఇస్తారని ఘాటుగా విమర్శించారు. హర్యాణా ఓటర్లు కాంగ్రెస్ మళ్లీ అబద్ధాల దుకాణాన్ని ఏర్పాటు చేయకుండా తెలివిగా ఉన్నారని చెప్పారు.

ఇక రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని వస్తున్న వార్తలను నాయబ్ సైనీ ఖండించారు. “రెండు పర్యాయాలు ఒక పార్టీ ప్రభుత్వంలో కొనసాగితే, మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇబ్బంది అవుతుందని ప్రతిపక్షాలు భావిస్తాయి. కానీ, మా విషయంలో అది తప్పు” అని స్పష్టం చేశారు. 

“ఇక్కడ, 2024 లోక్సభ ఎన్నికల్లో 2019 కంటే ఐదు సీట్లు తక్కువ గెలిచాము. అందులో మూడు సీట్లు చాలా తక్కువ తేడాతో కోల్పోయాము. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రతిపక్షాలు తప్పుడు కథనాలను సృష్టించాయి. అదే హర్యాణాలో మాకు ఇబ్బంది కలిగించింది. అయితే కాంగ్రెస్ తప్పుడు వార్తలు వ్యాపింపజేస్తే, మేము సరైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాము.” అని సైనీ వివరించారు.

మరోవైపు, ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న బీజేపీ నాయకులు గురించి సైనీ ప్రస్తావించారు. వారందరినీ ఒప్పించేందుకు ప్రయత్నించామని, అయితే కొందరు అంగీకరించారని, మరికొందరు పోటీలో ఉన్నారని తెలిపారు. అయితే ఈ విషయం తమ ఓట్లని ప్రభావితం చేయదని చెప్పారు.

“2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో అవినీతి, పక్షపాతం రాజ్యమేలాయి. కానీ ఆ విధానాన్ని రద్దు చేసి, మా ప్రభుత్వం పారదర్శకతతో 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 24 పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) ఇస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం కూడా ఇలా మేము ఇస్తున్నట్లు ఇవ్వలేదు.” అని సైనీ వివరించారు.