ప్రజా భద్రతే ముఖ్యం.. అది గుడా.. దర్గా అని చూడొద్దు

ప్రజా భద్రతే ముఖ్యం.. అది గుడా.. దర్గా అని చూడొద్దు
అక్రమ కట్టడాల కూల్చివేతలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రజా భద్రతే ముఖ్యమని, రహదారి, చెరువులు లేదా రైల్వే ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన ఏ అక్రమ కట్టడాన్నైనా మతాలతో సంబంధం లేకుండా కూల్చివేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. 
 
భారత్ లౌకిక దేశమని, మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ బుల్డోజర్ చర్యలు, ఆక్రమణల కూల్చివేతల ఆదేశాలు వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. నేరం జరిగిన ఒకటి రెండు రోజుల్లో పలు కారణాలు చూపిస్తూ నిందితుల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇది బుల్డోజర్ జస్టిస్ అంటూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. దీనిని కోర్టులు ఆక్షేపించాయి. 
 
ఒకవేళ నిందితుడు నేరానికి పాల్పడినా సరే ఇంటిని కూల్చడం సరికాదని వ్యాఖ్యానించాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. బుల్డోజర్ జస్టిస్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ విచారించారు.
 
కాగా, ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉండటం వల్లే బుల్డోజర్ చర్యను ఎదుర్కోవడానికి కారణమవుతుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి మెహతా ఇలా సమాధానమిస్తూ ‘ఖచ్చితంగా కాదు అత్యాచారం లేదా ఉగ్రవాదం వంటి ఘోరమైన నేరాలకు పాల్పడినా అలాంటి చర్యలు తీసుకోరు..’ అని తెలిపారు. 
 
అయితే, కూల్చివేతల విషయంలో పంచాయతీలు, మున్సిపాల్టీల చట్టాలకు వ్యత్యాసం ఉందని, వీటిని ఆన్‌లైన్‌లో ఉంచితే ప్రజలకు అవగాహన వస్తుందని ధర్మాసనం పేర్కొంది.  ఈ సమయంలో సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ కొన్ని సందర్భాల్లో కోర్టు ఆదేశాలు జారీ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఒకటీ రెండు సంఘటనల ఆధారంగా న్యాయస్థానం ఓ అంచనాకు రావద్దని కోరారు. ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి ముందుగా నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ కట్టడాలని తేల్చాక నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నట్లు వివరించారు. ఏదో ఒక ఘటననో, ఓ వర్గం వారి ఆరోపణలతోనో కూల్చివేతలు అక్రమమని భావించవద్దని కోరారు.
 
దీనికి ధర్మాసనం స్పందిస్తూ  ‘మనది లౌకిక దేశం.. ఆక్రమణల విషయంలో మతం లేదా వర్గాలకు అతీతంగా మా ఆదేశాలు ఉంటాయి. వాస్తవానికి రహదారి, ఫుట్‌పాత్, చెరువులు లేదా రైల్వే లైన్ అయితే ప్రజా భద్రత ముఖ్యం. ఏదైనా మతపరమైన నిర్మాణం గురుద్వారా లేదా దర్గా లేదా ఆలయం ఉంటే అది ప్రజలకు ఆటంకం కలిగించరాదు’ అని స్పష్టం చేసింది.
 
అనధికార నిర్మాణాలపై ఒక చట్టం ఉండాలి, అది మతం లేదా విశ్వాసం లేదా నమ్మకంపై ఆధారపడి ఉండదని జస్టిస్ గవాయ్ తెలిపారు.  అయితే, కూల్చివేతలకు నేరారోపణలు ఆధారం కాకూడదని, పౌర నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో మాత్రమే ముందుకెళ్లాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు అనుమతి లేకుండా కూల్చివేతలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. కాగా, యూపీలో క్రిమినల్స్‌కు యోగి సర్కారు బుల్డోజర్ల ట్రీట్మెంట్ తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన విషయం తెలిసిందే.