విశాఖ స్టీల్‌ పరిరక్షణకు సెయిల్‌తో చర్చలు నిజమే

విశాఖ స్టీల్‌ పరిరక్షణకు సెయిల్‌తో చర్చలు నిజమే
విశాఖ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని చెబుతూ  విశాఖ స్టీల్‌ను లాభాల బాటలో పట్టించేందుకు సెయిల్‌ అనే సంస్థతో సమావేశం జరిగిన మాట వాస్తవమని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ప్లాంట్‌ను, ఉద్యోగులు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గత పాలకుల వైపల్యాలు, వారి సొంత ప్రయోజనాలు, నాయకుల మెప్పు కోసం స్టీల్‌ప్లాంట్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. వారి వల్లే విశాఖ ప్లాంట్‌ నష్టాల్లోకి వెళ్లిందని ఆరోపించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నష్టాల్లో నడుస్తున్న సంస్థలను పదేపదే నడపటం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.  

అందుకనే, విశాఖ స్టీల్‌ను శాశ్వతంగా నడిపేందుకు కేంద్రం సహాయం చేస్తూనే ఏ విధంగా లాభాల బాటల్లోకి తీసుకువచ్చేందుకు అన్ని కోణాల్లో ఆలోచించుతున్నామని పేర్కొన్నారు.  కేంద్ర మంత్రి కుమారస్వామి, ఆర్థిక మంత్రి నిర్మలసీతరామన్‌లకు ప్లాంట్‌పై పూర్తిగా అవగాహన ఉందని ఆయన చెప్పారు. 

సెయిల్‌లో విలీనం వల్ల వచ్చే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.  విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ప్రజల సెంటిమెట్లను నిలబెట్టేలా ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు.  విశాఖలో ఉద్యోగులు ఎక్కువ, ప్రొడక్షన్‌ తక్కువ కారణంగా నష్టాల్లో నడుస్తుందని ఆయన చెప్పారు.

సమర్ధవంతమైన అధికారులను నియమించి లాభాల బాట పట్టించడానికి తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నానని శ్రీనివాస వర్మ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించక తప్పదని ఆయన తేల్చి చెప్పారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు చెందిన 1,500 ఎకరాల భూమిని ఎన్‌ఎండిసికి బదలాయించి ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రధానంగా చర్చించామని తెలిపారు.

కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ దిగజారిందని, గతంలో దేవలయాలపై దాడులు జరిగితే ఒక్కరిపైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రామ తీర్ధంలో రాముడి తల తీశారని, అంతర్వేదిలో రథం దగ్దం చేశారని గుర్తు చేశారు. కొవ్వు పదార్ధాలు కలిసిన నెయ్యిని దిగుమతి చేసుకున్నారన్నది వాస్తవమని, లాబ్ రిపోర్ట్స్ ఉన్నాయని స్పష్టం చేశారు. 

గతంలో ఏడు కొండలను రెండు కొండలు చేద్దామనుకున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. హిందు ధర్మం ప్రకారం దంపతులు పట్టు వస్త్రాలు ఇచ్చేవారని, కానీ జగన్‌ ఒక్కరే ధర్మానికి వీరుద్ధంగా పట్టు వస్త్రాలు ఇచ్చారని ఆరోపించారు. డిక్లరేషన్ ఇవ్వాలన్నది చాలా సంవత్సరాలుగా ఉన్న నిబంధన అని చెప్పారు. 

లడ్డూ విషయంలో తొమ్మింది మందితో సిట్ ఏర్పాటు చేశారని.. లడ్డూ విషయంలో అవకతవకలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో టీటీడీని తన కుటుంబ సభ్యుల ఆధీనంలో పెట్టుకున్నారని ఆరోపించారు. తిరుపతిని జగన్ కుటుంబ సభ్యుల చేతుల్లో పెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.