ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి దాయాది దేశం అసలురంగును భారత్ మరోసారి ప్రపంచానికి చూపించింది. యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్ ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదం, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాకిస్థాన్ ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగందని ధ్వజమెత్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంఘటనల్లో పాక్ ప్రమేయం ఉందని, సరిహద్దు ఉగ్రవాదానికి అనివార్య పరిణామాలను ఆ దేశం భరించాల్సి ఉంటుందని తెలుసుకోవాలని ఆమె హితవు చెప్పారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సాధారణ చర్చలో పాక్ ప్రధాని షాబాజ్ జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
జమ్ములో ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, 2019లో ఆర్టికల్ 370ని అనాలోచితంగా రద్దు చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయితే, దీనిపై భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు రవాణా, నేరాలతో అపఖ్యాతిని మూటగట్టుకున్న ఆ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై దాడి చేసేందుకు సాహించిందని విమర్శించారు. పాక్ చాలాకాలంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పొరుగుదేశాలపై ఆయుధంగా ప్రయోగిస్తున్నదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్, ఆర్థిక రాజధాని ముంబయి, మార్కెట్లు, యాత్రా మార్గాలో దాడి చేసిందని పేర్కొంటూ ఆ దేశం హింస గురించి మాట్లాడడం కపటత్వమేనని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు చరిత్ర ఉన్న దేశం ప్రజాస్వామ్యంలో రాజకీయాలపై మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు.
భారత్‌లో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తుందని, ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించిన పరిణామాలను ఆ దేశం కచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్ అర్థం చేసుకోవాలని ఆమె తేల్చి చెప్పారు.
“నిజం ఏమిటంటే, పాకిస్తాన్ మా భూభాగాన్ని కోరుకుంటుంది. భారతదేశంలో విడదీయరాని మరియు అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలకు అంతరాయం కలిగించడానికి నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోంది. వ్యూహాత్మక సంయమనం కొన్ని ప్రతిపాదనల గురించి ప్రస్తావించబడింది” అని ఆమె చెప్పారు.
1971లో మారణహోమానికి పాల్పడి నేటికి మైనారిటీలను అణచివేస్తున్న దేశం అసహనం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆమె దయ్యబట్టారు. సుదీర్ఘకాలం ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించిన దేశం గురించి మనం మాట్లాడుకుంటున్నామని ఆమె గుర్తు చేశారు. “పాకిస్థాన్ చాలా కాలంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని తన పొరుగు దేశాలపై ఆయుధంగా ఉపయోగిస్తోంది” అని మంగళానందన్ పేర్కొన్నారు. “ఇది మా పార్లమెంటు, మా ఆర్థిక రాజధాని ముంబై, మార్కెట్‌ప్లేస్‌లు, తీర్థయాత్ర మార్గాలపై దాడి చేసింది. జాబితా చాలా పెద్దది” అని ఆమె చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్నదని, అక్కడి విధానాలు ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారాయని ఆమె పేర్కొన్నారు. పాక్ ఎన్ని అబద్ధాలు చెబుతూ నిజాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుందని తమకు తెలుసునని ఆమె తెలిపారు. పదేపదే రిపీట్ చేయడం వల్ల ఏమీ మారదని.. ఈ విషయంలో తమ స్టాండ్ స్పష్టంగా ఉందని భవికా స్పష్టం చేశారు.
More Stories
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి నిధులివ్వాలి