వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడంతో ఆ దేశంపై ఆశలు పెట్టుకున్న భారతీయులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే అమెరికన్ టెక్ ఇండస్ట్రీ లే ఆఫ్‌ల ప్రభంజనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఈ పరిణామాలు ఇండియన్ వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హెచ్-1బీ వీసాలు ఉన్నవారి పరిస్థితి వర్ణనాతీతం.
ఈ ధోరణితోపాటు కఠినమైన వీసా నిబంధనలను ప్రవేశపెట్టడం, దరఖాస్తు ధరను విపరీతంగా పెంచేయడం వల్ల అమెరికాలోని భారతీయ వలసదారులు, అంతర్జాతీయ విద్యార్థులు, నైపుణ్యం గల కార్మికులకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఇటీవల దాదాపు 438 టెక్ కంపెనీలు సుమారు 1,37,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
దీంతో ఆర్థిక ఒడిదొడుకులను తట్టుకుని నిలిచే కోట అని టెక్ రంగంపై గతంలో ఉన్న భావం చెదిరిపోతున్నది. ఉద్యోగాల కొరత వల్ల హెచ్-1బీ వీసాదారులపై విపరీతమైన ఒత్తిడి ఉంది. వీరు నిర్దిష్ట సమయంలో కొత్త ఉద్యోగాన్ని సంపాదించుకోగలగాలి లేదంటే, అమెరికాను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుంది.అమెరికా వీసా విధానాల్లో ఇటీవల వచ్చిన మార్పులు ఇండియన్ వర్కర్ల పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ విడుదల చేసిన 2024 అక్టోబర్ వీసా బులెటిన్ రానున్న ఆర్థిక సంవత్సరానికి అందుబాటులో ఉండే ఇమిగ్రెంట్ వీసాల సమాచారాన్ని వెల్లడించింది. ఇది ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ సహా వివిధ వీసా క్యాటగిరీల్లోని దరఖాస్తుదారులకు ఆందోళనను రేకెత్తించింది.
కొన్ని రంగాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడి పెట్టినవారు రెసిడెన్సీ పొందేందుకు ఇన్వెస్టర్ వీసా అవకాశం కల్పిస్తుంది. కానీ చైనా, భారత్ నుంచి వచ్చే దరఖాస్తులకు ఈ అవకాశాలు అందడంలో విపరీతమైన జాప్యం జరుగుతున్నది. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుము ఒక లబ్ధిదారుకు 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెరిగింది. అంటే 2,150 శాతం పెరిగిందన్న మాట!
పేపర్ ఫైలింగ్ రుసుము 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది. ఓ వైపు ఉద్యోగాల పరిస్థితి అనిశ్చితంగా ఉండగా, ఇంత భారీగా రుసుములు పెరగడం దరఖాస్తుదారులకు గుదిబండగా మారింది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు కూడా నిబంధనలు మారాయి.
ఐ-30 పిటిషన్ పేపర్ సబ్‌మిషన్‌కు రుసుము 675 డాలర్లకు, ఆన్‌లైన్‌లో దాఖలు చేస్తే వసూలు చేసే రుసుము 625 డాలర్లకు పెరిగింది, అసైలమ్ పిటిషన్‌లకు కొత్తగా 600 డాలర్ల ఫీజును నిర్ణయించారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎఫ్, ఎం, జే వీసాల కోసం దరఖాస్తు చేస్తే, పాస్‌పోర్టులకు సంబంధించి అదనపు తనిఖీలను ఎదుర్కోవాల్సి వస్తున్నది.
More Stories
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
కెనడాలో వెయిటర్ ఉద్యోగాలకై వేల మంది భారతీయుల క్యూ
బతుకమ్మకు అమెరికాలో అధికారిక గుర్తింపు