నేపాల్​లో వరద బీభత్సానికి 112 మంది బలి

నేపాల్​లో వరద బీభత్సానికి 112 మంది బలి
నేపాల్‌ దేశాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. ఈ వరదలకు రాజధాని ఖాట్మండు సహా ఎనిమిది జిల్లాల్లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఆదివారం ఉదయానికి నేపాల్‌ వరద మృతుల సంఖ్య 112కు చేరింది. మరో 68 మంది ఆచూకీ లేకుండా పోయారు.

మృతుల్లో కావ్రే పాలన్‌చౌక్‌ ఏరియాకు చెందిన వారు 34 మంది, లలిత్‌పూర్‌కు చెందిన వారు 20 మంది, దాడింగ్‌కు చెందిన వారు 15 మంది, ఖాట్మండుకు చెందిన వారు 12 మంది, మక్వాన్‌పూర్‌కు చెందిన వారు ఏడుగురు, సింధ్‌పాల్‌ చౌక్‌కు చెందిన వారు నలుగురు, డోలఖకు చెందిన వారు ముగ్గురు, పంచ్‌తర్‌, భక్తపూర్‌ జిల్లాలకు చెందిన వారు ఐదుగురు చొప్పున ఉన్నారు.

ఆకస్మిక వరదలు పోటెత్తడం వల్ల దేశంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. జనజీవనం స్తంభించింది. ఈ వరదలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని విపత్తు ప్రతిస్పందన అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఆ నీరంతా సమీపంలోని గ్రామాల్లోకి పోటెత్తింది. దాంతో అనేక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి. దాదాపు 1,244 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. దేశవ్యాప్తంగా 44 జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించినట్లు సదరు మీడియా పేర్కొంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి.

వరదల కారణంగా అధికారులు 39 జిల్లాల్లో రహదారులను పూర్తిగా మూసివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది. దాదాపు 3 వేల మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు వెయ్యి మంది వరకు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.