హిజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హిజ్‌బొల్లా అధినేత హస్సన్ నస్రల్లాను టార్గెట్ చేస్తూ శుక్రవారం ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో హిజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం అధికారికంగా ధ్రువీకరించింది. తాము చేసిన దాడుల్లో నస్రల్లా మృతి చెందినట్లు వెల్లడించింది.
హిజ్‌బొల్లా చీఫ్‌ను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ ఏకంగా 80 టన్నులకుపైగా బాంబులను వాడినట్లు స్థానిక మీడియా నివేదించింది. బంకర్లలోకి చొచ్చుకెళ్లేంత బరువు ఉన్న బాంబులను ఐడీఎఫ్ వాడినట్లు పేర్కొంది. ఇందుకోసం ఉపయోగించిన ఒక్కో బాంబు సగటున ఒక టన్ను బరువు ఉంటుందని తెలిపింది.
కాగా, నస్రల్లాను అంతమొందించడమే లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. బీరుట్‌లో ఉన్న బిల్డింగ్‌లను టార్గెట్ చేస్తూ వైమానిక దాడులకు పాల్పడింది. ఆ సిటీలో ఉన్న హిజ్‌బొల్లా కమాండ్ సెంటర్‌పై తీవ్ర స్థాయిలో వైమానిక దాడి జరిగింది. దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని భూగర్భంలో ఉన్న హిజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది.
అండర్‌గ్రౌండ్ హెడ్‌క్వార్టర్స్‌లో దాక్కున్న నస్రల్లా ఆ అటాక్‌లో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే, తాజా దాడుల్లో నస్రల్లాకు ఏమీ కాలేదని హిజ్‌బొల్లా వర్గం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తమ దాడుల్లో నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. ‘హసన్ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేయలేరు’ అంటూ ఐడీఎఫ్ ట్వీట్ చేసింది.
నస్రల్లా టార్గెట్‌తో చేపట్టిన ఆపరేషన్‌కు ‘న్యూ ఆర్డర్’ అని పేరు పెట్టారు. బీరుట్‌పై జరిగిన దాడులకు చెందిన ఫోటోలను ఇజ్రాయిల్ వైమానిక దళం రిలీజ్ చేసింది. శుక్రవారం రాత్రి నుంచి హిజ్‌బొల్లా చీఫ్ హస్సన్ నస్రల్లా ఆచూకీ తెలియడంలేదని, అతనితో కాంటాక్ట్ తెగిపోయినట్లు ఆ గ్రూపునకు చెందిన కొందరు వెల్లడించారు. హిజ్‌బొల్లా అధికారి పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.
మరోవైపు తాజా దాడుల్లో నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆమె మరణంపై హిజ్‌బొల్లా గానీ, లెబనాన్ అధికారులుగానీ అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఈ నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. భద్రతా కారణాల దృష్ట్యా తన సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత అధికారులు వెల్లడించినట్లుగా అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అదే సమయంలో నస్రల్లా హతం వేళ తదుపరి కార్యాచరణ విషయంలో హిజ్‌బొల్లా, ఇతర సంస్థలతో ఇరాన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సరదు అధికారులు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.
తమ దేశాన్ని, పౌరుల్ని ఎవరు బెదిరించినా, వాళ్లను ఇజ్రాయిల్ వదిలి పెట్టదని ఐడీఎప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెజ్రీ హలేవీ తెలిపారు. శుక్రవారం జరిపిన దాడిలో అంండర్‌గ్రౌండ్ బిల్డింగ్‌ల్లో దాచిన డజన్ల కొద్దీ యాంటీ షిప్ మిస్సైళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. చైనాకు చెందిన సీ-704, సీ802 మిస్సైళ్లు హిజ్‌బొల్లా వద్ద ఉన్నట్లు గుర్తించామని ఇజ్రాయిల్ తెలిపింది. 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఇరాన్ క్షిపణి గదార్ కూడా హిజ్‌బొల్లా వద్ద ఉన్నట్లు ఇజ్రాయిల్ మిలిటరీ తెలిపింది.
More Stories
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి నిధులివ్వాలి