పరువు నష్టం కేసులో సంజయ్‌ రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష

పరువు నష్టం కేసులో సంజయ్‌ రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష
బీజేపీ మాజీ ఎంపీ కిరీట్‌ సోమయ్య భార్య మేధా సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముంబై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ కు జైలు శిక్ష విధించింది. సెక్షన్‌ 500 కింద సంజయ్‌ రౌత్‌ను దోషిగా నిర్ధారించిన ముంబై కోర్టు ఆయనకు 15 రోజుల సాధారణ జైలు శిక్ష  విధించింది. అంతేకాదు, రూ.25 వేల జరిమానా కూడా వేసింది.
 
అయితే, పై కోర్టుకు వెళ్లేందుకు వీలుగా ఈ తీర్పును 30 రోజుల పాటు రద్దు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.  కిరీట్‌ సోమయ్య కుటుంబ సభ్యులు ఓ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. అయితే, ముంబై శివారులోని మీరా భయందర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రూ.100 కోట్ల టాయిలెట్‌ స్కామ్‌ జరిగిందని ఆరోపిస్తూ శివసేనకు చెందిన సామ్నా పత్రికలో వరుస కథనాలు వచ్చాయి. 
 
అంతకు ముందు కూడా సోమయ్య కుటుంబీకులు నడిపిస్తున్న స్వచ్ఛంద సంస్థకు ఇందులో భాగస్వామ్యం ఉందని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ఈ క్రమంలోనే మేధా సోమయ్య 2022 ఏప్రిల్‌లో సంజయ్‌ రౌత్‌పై పరువు నష్టం దావా వేశారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా టాయిలెట్‌ స్కామ్‌ పేరుతో శివసేనకు చెందిన సామ్నా పత్రికలో వస్తోన్న కథనాలు తన పరువుకు నష్టం కలిగించేవిలా ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
 
తన పరువుకు నష్టం కలిగించినందుకు క్షమాపణలు చెప్పడంతోపాటు వ్యక్తిగతంగా తనకు భంగం కలిగించే కథనాలను ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌ ద్వారా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ముంబై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
 
కాగా, ప్రధాన మంత్రి వంటి వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి ఇంటికి గణేష్ ఉత్సవాలకు వెడుతున్న దేశంలో అవినీతికి, ఇతర అక్రమాలకు వైతిరేకంగా స్వరం వినిపిస్తున్న తనవంటి వారికి కోర్టులలో న్యాయం లభిస్తుందని ఏవిధంగా ఆశిస్తాను? అని తీర్పుపై స్పందిస్తూ సంజయ్ రౌత్ చెప్పారు. తాను కేవలం పురపాలక సంఘంలో ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలో చేసిన ఫిర్యాదులను, స్థానిక ఎమ్మెల్యే విచారణకు డిమాండ్ చేసిన అంశాలను మాత్రమే లేవనెత్తానని ఆయన తెలిపారు.