జమ్మూ కాశ్మీర్లో 60 ఏళ్లలో మీరేం చేశారో, గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు బహిరంగ చర్చకు రావాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ బిజెపి ఎన్నికల ఇన్ ఛార్జ్ జి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మహారాజా హరిసింగ్ పార్కులోని ఆయన విగ్రహం ముందు.. మీడియా ప్రజలు, మేధావుల సమక్షంలో చర్చకు రావాలని కోరారు.
జమ్మూ కాశ్మీర్ లో బీజేపీలో డోగ్రా స్వాభిమాన్ సంఘటన్ పార్టీ విలీనం సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఏది పడితే అది మాట్లాడకుండా, చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని హితవు చెప్పారు. 2004-2014 మధ్యలో మీ పరిపాలనలో జమ్మూ కాశ్మీర్ లో అశాంతి, అలజడి తప్ప మీరు సాధించిందేమీ లేదని ధ్వజమెత్తారు.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహారాజా హరిసింగ్ విషయంలో చేసిన వ్యాఖ్యల్నితీవ్రంగా కిషన్ రెడ్డి ఖండించారు. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఓడించినా ఆయనలో మార్పురాలేదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసినా దేశ చరిత్రమీద, వాస్తవ పరిస్థితులమీద కనీస అవగాహన కూడా రాలేదని అర్థమవుతోందని ధ్వజమెత్తారు.
జమ్ము కాశ్మీర్ ప్రజల మనసు గెలిచి మహరాజా హరి సింగ్ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని చెబుతూ అలాంటి వ్యక్తి విషయంలో రాహుల్ మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. మహారాజా హరి సింగ్ గారు పారిపోయాడని, తాము పంపించేశామని వారిని అవమానించే రీతిలో మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా ప్రతి ఇంట్లో మహారాజా హరిసింగ్ గారి ఫోటో ఉంటుందని, జమ్ము ప్రజలు వారిని అంతలా ప్రేమిస్తారని, గౌరవిస్తారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి మహనీయుడిని అవమానించడమంటే యావత్ డోగ్రా సమాజాన్ని, జమ్మూకాశ్మీర్ ప్రజలను అవమానించడమే అని స్పష్టం చేసారు.
లెఫ్టినెంట్ గవర్నర్ గురించి కూడా రాహుల్ చాలా చులకనగా మాట్లాడారని, బయటినుంచి వచ్చిన వ్యక్తికి ఇక్కడ పెత్తనమేంటని అన్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. రాహుల్ కు చరిత్ర తెలియదని, జమ్మూకశ్మీర్లో 1965లో గవర్నర్ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత కరణ్ సింగ్ ను మినహాయిస్తే మిగిలిన వారందరూ వేరేప్రాంతాలనుంచి వచ్చిన వారే అని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాగే స్థానికేతరులే గవర్నర్లుగా ఉంటున్నారని హితవు చెప్పారు.
పార్లమెంట్ లో వివిధ చట్టాలపై చర్చ సందర్భంగా దేశ సైనికుల గురించి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారని గుర్తు చేశారు. ఇతర దేశాల్లో మన దేశ వ్యవస్థలను అగౌరవపరుస్తూ మాట్లాడతారని, ఎన్నికల వ్యవస్థను, పార్లమెంటును, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరుస్తారని కిషన్ రెడ్డి విమర్శించారు. కులాలు,మతాలు, భాషల పేరుతో సమాజాన్ని విడదీసేలా మాట్లాడతారని ఆరోపించారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
చైనా జలవిద్యుత్ డ్యామ్ లతో 12 లక్షల మంది టిబెటన్ల నిరాశ్రయం