వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి

వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞాన నిధి అని, మొత్తం విశ్వానికి మూలం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. మొత్తం ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు ఉపకరిస్తాయని తెలిపారు. ఢిల్లీలోని  అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో శ్రీపాద్ దామోదర్ సత్వలేకర్ రచించిన వేదాల హిందీ వ్యాఖ్యానం మూడో ఎడిషన్‌ను ఆవిష్కరిస్తూ వేదాలు, భారతదేశం ఒకటేనని అని స్పష్టం చేశారు.
 
వేదాలు సనాతన ధర్మానికి ఆధారం అని చెబుతూ వేదాలలో విజ్ఞానం, సైన్స్, గణితం, మతం, వైద్యం, సంగీతం సమృద్ధిగా ఉన్నాయని ఆయన తెలిపారు. వేదాల్లోని మంత్రాల్లో కూడా అంకగణితం, క్యూబ్, క్యూబ్ రూట్ సూత్రాలు స్పష్టంగా పేర్కొన్నారని ఆయన చెప్పారు. వేదాలలో సమస్త లోక సంక్షేమం గురించిన చర్చలు ఉన్నాయని చెబుతూ వేదాలు ప్రపంచంలోని సమస్త మానవాళి ఐక్యతకు మార్గాన్ని చూపుతాయని డా. భగవత్ స్పష్టం చేశారు.
 
సనాతన సంస్కృతిలో జీవితాన్ని గడపడానికి పోటీ పడాల్సిన అవసరం లేదని, వేదాలు మనకు దీనిని నేర్పించాయని చెబుతూ. ‘సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ’ అని డాక్టర్ భగవత్ పేర్కొన్నారు. మన ఋషులు లోకకల్యాణం కోసం వేదాలను రచించారని చెప్పారు.
 
మనదేశంలో కొడుకు కడుపు నిండగానే అమ్మ తృప్తి చెందుతుందని పేర్కొంటూ సైన్స్ దీన్ని నమ్మకపోవచ్చు కానీ ఇది భౌతిక వాదానికి మించిన ఆనందం అని వివరించారు.  అన్ని విజ్ఞాన వ్యవస్థలలో వేదాల ఆధారాన్ని చూడవచ్చని చెబుతూ  మొత్తం మానవాళి వేదాల అధ్యయనం ద్వారా జ్ఞానోదయం పొందుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
 
మహామండలేశ్వర్‌పూ స్వామి బాల్కనంద్‌ గిరిజీ మహరాజ్‌ మాట్లాడుతూ వేదాలను, సనాతన గురుకులాలను ఆక్రమణదారులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినా మన మహర్షుల స్మృతిలో నిలిచిన వేదాలను ధ్వంసం చేయలేకపోయారని తెలిపారు. అందుకే భారతీయ సంస్కృతిలో వేదాలు శాశ్వతమైనవని, అవి అలాగే ఉంటాయని స్పష్టం చేశారు.
 
నాలుగు వేదాలలోని 10 సంపుటాలుగా హిందీ వ్యాఖ్యానం ఆవిష్కరణ డా. భగవత్ ఆశీస్సులతో పూర్తయింది. శ్రీపాద్ దామోదర్ సత్వలేకర్ వ్యాఖ్యానించిన ఈ నాలుగు వేదాలలోని 8 వేల పేజీలను గుజరాత్‌లోని స్వాధ్యాయ మండల్ పార్డి,  లాల్ బహదూర్ శాస్త్రి వేద అధ్యయన కేంద్రం ప్రచురించినట్లు విశ్వహిందూ పరిషత్ పోషకుడు,  సెంట్రల్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు  దినేష్ చంద్ర కార్యక్రమ పరిచయంలో తెలిపారు. 
 
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం  దీనిని ప్రచురించడానికి 10 సంవత్సరాలు అవిశ్రాంతంగా శ్రమించింది. ఈ సందర్భంగా ఈ మహత్తర కార్యంలో నిమగ్నమైన పండితులను, వారి సహచరులను సన్మానించారు. కార్యక్రమంలో దేశంలోని పలువురు ఋషులు, సాధువులు, సంఘ్, విశ్వహిందూ పరిషత్‌తో పాటు పలు ధార్మిక, సామాజిక, సాంస్కృతిక సంస్థల బాధ్యులు, సమాజ, మాతృశక్తికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.