రూ 1,000 కోట్లతో అమరావతి రైల్వే లైన్ కు భూసేకరణ

రూ 1,000 కోట్లతో అమరావతి రైల్వే లైన్ కు భూసేకరణ

అమరావతి నూతన రైల్వేలైన్ కోసం 510 ఎకరాల భూములు అవసరమని రైల్వే శాఖ గుర్తించింది. ఎన్టీఆర్ జిల్లాలో 296.86 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 155, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 60 ఎకరాల చొప్పున కావాలని రైల్వే శాఖ నుంచి మూడు జిల్లాల రెవెన్యూ యంత్రాంగాలకు 15 రోజుల కిందటే ప్రతిపాదనలు పంపింది. 

అయితే కృష్ణా, బుడమేరు వరదల కారణంగా ఈ అంశంపై దృష్టి పెట్టలేకపోయారు. తాజాగా అమరావతి రైల్వేలైన్ భూములపై ఆ శాఖ అధికారులతో భేటీ కావాలని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ఈ భూముల సేకరణకు రూ.1000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ వ్యయాన్ని భరించడానికి రైల్వే శాఖ అంగీకరించినట్టు సమాచారం. 

అమరావతి రైల్వే లైన్కు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం దగ్గర, ఎన్టీఆర్ జిల్లాలో కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో, గుంటూరు జిల్లా కొత్త పేట, వడ్లమాను, తాడికొండ, కొప్పవరం, నంబూరు ప్రాంతాల్లో భూ సేకరణ చేయాల్సి ఉంది. అదే విధంగా అమరావతి నుంచి పెదకూరపాడు వరకు 24.5 కి.మీ, సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వరకు 25 కి.మీ. మేర రెండో లైన్ను ప్రతిపాదించారు. 

వీటన్నింటినీ ఒకే ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. వీటికి ఏడు సంవత్సరాల క్రితమే సర్వే నిర్వహించగా, 2017-18లో రూ.2,800 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం మళ్లీ ఎన్టీఏ ప్రభుత్వం రావడంతో ఈ రైల్వేలైన్కు మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టును రైల్వే కూడా తన ప్రాధాన్యత జాబితాలో చేర్చింది. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోతే 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించాలని రెవెన్యూ యంత్రాంగం భావిస్తోంది. 

కాగా, నూతన రైల్వేలైన్ విజయవాడ మీదుగా కృష్ణా కెనాల్ను కలిపి, అక్కడ అమరావతి రైల్వేస్టేషన్ అభివృద్ధి చెయ్యాలని వస్తున్న ప్రతిపాదనలను రైల్వే పరిగణనలోకి తీసుకోవడం లేదు. పాత ఆలైన్మెంట్ ప్రకారమే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. కృష్ణా కెనాల్ జంక్షన్లో అమరావతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి అవసరమైన భూములు చాలా ఉన్నాయి. దీనివల్ల భూ సేకరణకు ఖర్చు కూడా 30 శాతం తగ్గుతుంది.