తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసిన జగన్

తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసిన జగన్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు మండిపడ్డారు. దేవుడి ప్రసాదం అపవిత్రం చేసేలా నాసిరకం పదార్థాలు వాడారని ఆయన ఎన్డీయే శాసనసభా సమావేశంలో ఆరోపించారు. గతంలో తిరుమల లడ్డూ నాణ్యత సరిగా లేదని వెంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అన్నదానంలో కూడా నాణ్యత పాటించలేదని చెబుతూ దేవుడి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి ప్రసాదానికి స్వచ్ఛమైన నెయ్యి వాడాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రసాదం నాణ్యత పెరిగిందని చెబుతూ స్వామివారి పవిత్రతను కాపాడుకోవాల్సి బాధ్యత ఉందని సీఎం చంద్రబాబు వివరించారు.

తప్పు చేసినవాడు ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేడని, కొంచెం ఆలస్యమైనా అవ్వచ్చు కానీ శిక్ష పడాల్సిందేనని చంద్రబాబు హెచ్చరించారు. అన్నా క్యాంటీన్ రద్దుచేసి జగన్ దుర్మార్గమైన పని చేశాడని దుయ్యబట్టారు. వైఎస్సార్​సీపీలో తప్పులు చేసిన వాళ్లని వదిలిపెట్టనని, విచారణలు జరుగుతున్నాయన్న చంద్రబాబు అదే సమయంలో మనం తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలని స్పష్టం చేశారు.

ఎటువంటి పొరపాట్లు జరగకుండా పనిచేశాం కాబట్టి ఇంత గెలుపు వచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు మెచ్చుకునే విధంగా మన నడవడిక ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది అనేది ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

కేంద్రంలో మనం అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్​పై ఉన్న ఆంధ్రాను కాపాడటం కష్టమయ్యేదని సీఎం చంద్రబాబు చెప్పారు. వైఎస్సార్​సీపీ చేసిన అవకతవకలు చూసి కేంద్ర మంత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన డబ్బులను దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు. త్వరలో విశాఖ రైల్వే జోన్​కు శంకుస్థాపన చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

ఎమ్మెల్యేలు ఒక విజన్ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. 2047 నాటికి పేదరికం అనేది ఉండకూడదని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్లు అప్పులు చేసిందని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే సహకారంతో మనం ముందుకు పోవాలని దిశానిర్దేశం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. వాలంటీర్లను వాడకుండా ప్రభుత్వ యంత్రాంగంతో ఒకే రోజు 100 శాతం పెన్షన్లు పంపిణీలు చేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.