ప్రజా సమస్యల పరిస్కారం కొరకు బీజేపీ `వారధి’

ప్రజా సమస్యల పరిస్కారం కొరకు బీజేపీ `వారధి’
ప్రజా సమస్యల పరిస్కారం కొరకు బీజేపీ వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు తెలిపారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న వారధి కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ బీజేపీ వారధి కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ చేసిన దురాగతాలకు ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. 100 రోజుల కూటమి ప్రభుత్వం పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయటంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విష్ణుకుమార్ రాజు వెల్లడించారు.

బుడమేరు వరద ఉదృతిలో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. నష్టపోయిన బాధితులు, అలాగే రైతులకు తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.  రాజధాని ప్రాంతం వరద ముంపుకు గురవుతుందని కొందరు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో అలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా వైసీపీ మాటలతో మోసం చేసిందని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు 100 రోజుల అడుగులు 100 సంవత్సరాల దేశ, రాష్ట్ర భవిష్యత్తు వైపుకే ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ కొనియాడారు. 100 రోజుల డబుల్ ఇంజన్ సర్కార్ గమనం కేంద్రంలో వికసిత భారత్, రాష్ట్రంలో వికసిత ఆంధ్ర వైపు ప్రయాణం సుస్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. 

ప్రధాని మోదీ దేశంలో 15 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల లక్ష్యంగా 100 రోజుల్లో మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారని తెలిపారు. 100 రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి ప్రణాళికలు వేగవంతం చేశారని గుర్తు చేశా రు. 100 రోజులలో రాష్ట్ర పంచాయితీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ పంచాయితీలకు ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేశారని తెలిపారు

దేశంలో పేదలకు 3 కోట్ల కొత్త గృహాల నిర్మాణం, 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కొనసాగింపు, మహిళలను లాక్ పతి దీదీలుగా అభివృద్ధి కోసం ప్రధాని మోదీ అడుగులు వేశారని చెప్పుకొచ్చారు. 100 రోజులలో అన్న క్యాంటీన్లతో పేదలకు ఆహారం, అర్హులైన వారికి రూ.4000 పెన్షన్, అకాల వరదలతో అతలాకుతలమైన ప్రజలను ఆదుకోవడం వంటి సేవలను సీఎం చంద్రబాబు అందించారని తెలిపారు.