వైసీపీకి కీలక నేత, మాజీ మంత్రి బాలినేని రాజీనామా

వైసీపీకి కీలక నేత, మాజీ మంత్రి బాలినేని రాజీనామా
ఒంగోలుకు చెందిన వైసీపీకి కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విలువలు నమ్ముకుని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు మంత్రిగా పనిచేశానని వెల్లడించారు.
 
జగన్ కు సన్నిహిత బంధువైన బాలినేని ప్రకాశం జిల్లాలో తోడల్లుడు వైవి సుబ్బారెడ్డికి పార్టీలో, ప్రభుత్వంలో ఆధిపత్యం పెరుగుతూ ఉండటం, తనకు మంత్రి పదవి పోవడంతో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధికారం కూడా కోల్పోవడంతో ఆ పార్టీని వీడినట్లు భావిస్తున్నారు.  కొన్ని కారణాలతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రాష్ట్రం ప్రగతి పథంలో రాజకీయాలకు అతీతంగా పయనిస్తే అభినందిస్తానని పేర్కొన్నారు.
రాజకీయంలో రాజకీయాలు వేరు, బందుత్వం వేరని వెల్లడించారు. జగన్‌ నిర్ణయాలు సరిగా లేనప్పుడూ తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు. జగన్‌ విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ‘కొన్ని రోజులుగా వైఎస్సార్​సీపీ అధిష్ఠానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాను. గురువారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలవబోతున్నాను. ఆ పార్టీలో చేరబోతున్నాను’ అని బాలినేని తెలిపారు.
 
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలును వీడారు. హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఓటమి బాధలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ పార్టీ అధినేత జగన్​ను కలవలేదు. పార్టీ సమావేశాలకూ దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో ఒకసారి ఒంగోలు వచ్చి తన రాజకీయ ప్రత్యర్థి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై విమర్శలు చేశారు. ఆ తర్వాత రోజే మళ్లీ ఒంగోలును వీడారు. వైఎస్సార్సీపీని వీడి వెళ్తున్న కార్పొరేటర్లనూ వారించే ప్రయత్నం చేయలేదు.