పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్లు

పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్లు

గుజరాత్‌లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సులో ఎన్డీయేతర రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు ఉత్సాహంగా పాలుపంచుకున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తెలిపారు. 2030 నాటికి ఈ రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు ముందుకొచ్చాయని ఆయన వెల్లడించారు. విద్యుత్‌ రంగాన్ని పునరుత్పాదక ఇంధన రంగంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని చెప్పారు.

ప్రహ్లాద్‌ జోషీ మంగళవారం గాంధీనగర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సదస్సులో నాలుగు దేశాలు హాజరయ్యాయని తెలిపారు.  పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచానికి భారత్‌ మార్గనిర్ధేశకత్వం వహించనుందని చెప్పారు. ఈరోజు దాదాపు 208 గిగావాట్‌ పునరుత్పాదక ఇంధనాన్ని మనం ఉత్పత్తి చేస్తున్నామని మంత్రి వివరించారు. 

ఎన్నో సవాళ్లను మోదీ ప్రభుత్వం అధిగమిస్తోందని, ఈ దిశగా పునరుత్పాక ఇంధన తయారీని ప్రోత్సహించేందుకు జర్మనీ, డెన్మార్క్‌లు మనతో చేతులు కలపడం సంతోషకరమని ఆయన తెలిపారు. ఏ రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిళ్లు లేకపోయిన అసోం నుంచి తమిళనాడు వరకూ అన్ని రాష్ట్రాలు పునరుత్పాదక ఇంధనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని మంత్రి వివరించారు. 

పునరుత్పాదక ఇంధన సదస్సు విజయవంతమైందని, ఈ రంగంలోకి రానున్న కొద్ది సంవత్సరాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని, పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్‌ పునరుత్పాదక ఇంధన రంగానిదేనని ప్రహ్లాద్‌ జోషీ వెల్లడించారు.