పిల్లల భవిష్యత్తు కు భరోసాగా “ఎన్పీఎస్ వాత్సల్య” నేడే ప్రారంభం

పిల్లల భవిష్యత్తు కు భరోసాగా “ఎన్పీఎస్ వాత్సల్య” నేడే ప్రారంభం
చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన పథకాన్ని తీసుకువచ్చింది. “ఎన్పీఎస్ వాత్సల్య” పేరుతో కొత్త పథకానికి ప్రధాని మోదీ సర్కార్ శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా వాత్సల్య పథకాన్ని బుధవారం ప్రారంభించనున్నారు.  ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో వాత్సల్య పథకాన్ని ప్రకటించారు.
ఈ మేరకు పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు దీర్ఘకాలంపాటు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సరైన పథకంగా దీన్ని ఆమె వర్ణించారు.  ఈ సందర్భంగా బుధవారం రోజున పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పింఛన్ల నియంత్రణ, అభివృద్థి ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్‌డీఏ, కేంద్రం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం దానికి సంబంధించిన విధివిధానాలు వెల్లడిస్తారు.

ఎన్పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా దాదాపు 75 ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి దేశవ్యాప్తంగా స్కీమ్‌ను ప్రారంభించనున్నారు. కొంత మంది బాల బాలికలకు అక్కడే వాత్సల్య ఖాతాలు తెరిచి పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పి ఆర్ ఎ ఎన్ ) మెంబర్‌షిప్ కార్డులు అందజేయనున్నారు. 

అలాగే స్కీమ్‌కు సంబంధించిన ఆన్‌లైన్ పోర్టల్, బ్రోచర్నీ కేంద్రమంత్రి నిర్మలా ఆవిష్కరించనున్నారు. భారత పౌరులతో పాటు ఎన్‌ఆర్‌ఐలు, ఓవర్సీస్‌ సిటిజెన్స్‌‌లూ తమ పిల్లల పేరున వాత్సల్య ఖాతాలు ప్రారంభించవచ్చు. ఏడాదికి కనీసం రూ. 1,000 జమ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. గరిష్ఠ పరిమితంటూ ఏమీ లేదు. 

ఈ పొదుపు ద్వారా తల్లిదండ్రులు పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుతం 80సీ కింద లభిస్తున్న రూ.1.50లక్షల మినహాయింపునకు ఇది అదనం. సెక్షన్‌ 80(సీసీడీ)(1బీ) కింద రూ.50వేల వరకూ అదనంగా పన్ను మినహాయింపు లభిస్తుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత అప్పటివరకూ పొదుపు చేసిన సొమ్ములో 60శాతాన్ని ఏకమొత్తంగా వెనక్కి తీసుకోవచ్చు. 

మిగిలిన మొత్తాన్ని సాధారణ పెన్షన్ చెల్లింపుల రూపంలో ఇస్తారు. పిల్లల్లో పొదుపు, ఆర్థిక బాధ్యతలపై అవగాహన కల్పించడం ఈ పథకం ఆశయాలు అని చెప్పవచ్చు. దేశ ప్రజలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2004లో జాతీయ పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది.  ప్రజలకు దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు, పన్ను ప్రయోజనాలు సైతం కల్పిస్తుండడంతో దీనికి ఆదరణ లభించింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని తీసుకొస్తోంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్ ), సుకన్య సమృద్ధి యోజన, తదితర పథకాల తరహాలోనే దీన్ని తీసుకువస్తున్నారు.