ప్రపంచంలో ఆర్థికాభివృద్ధి సవాళ్ల సుడిగుండంలో చిక్కుకుందని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డిజిటల్ విప్లవం, వాతావరణ మార్పులు వంటివి ఆర్థికాభివృద్ధి రూపు రేఖలను మార్చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రపంచ వాణిజ్య నివేదిక – 2024’ పేరుతో డబ్ల్యుటిఒ ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది.
భౌగోళికంగా, రాజకీయంగా తలెత్తే ఉద్రిక్తతలు, ప్రాంతీయ ఘర్షణలు, వాణిజ్య ఆంక్షలు ఇవన్నీ కలిసి గత 30 ఏళ్ళలో ప్రపంచ ఆర్ధికాభివృద్ధి పునాదిని తీవ్రంగా ప్రభావితం చేశాయని అంచనా వేసింది. ఈ పరిస్థితులు వాణిజ్య విభజనకు దారి తీసే అవకాశాలు వున్నాయని పేర్కొంది. మరోవైపు, పెరిగిన పెట్టుబడులు, ఆధునిక తయారీ నైపుణ్యాల తీవ్రత కారణంగా తయారీ రంగ అభివృద్ధికి అవకాశాలనేవి తక్కువ ఆదాయాన్నిచ్చే ఆర్థిక వ్యవస్థల్లో తగ్గిపోయాయి.
వాతావరణ మార్పులు మరింత తీవ్రమైన సవాళ్ళను విసురుతున్నాయి. ముఖ్యంగా ఈ తక్కువ ఆదాయ దేశాల్లో పరిస్థితి మరీ దారుణంగా వుంటోందని నివేదిక పేర్కొంది. అయితే కొత్తగా ఆవిర్భవించే ఈ ధోరణులు కొత్త అవకాశాలను కూడా తీసుకువస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఉదాహరణకు, డిజిటలైజేషన్ ద్వారా వాణిజ్య వ్యయాలను వర్ధమాన దేశాలు తగ్గించుకోగలుగు తున్నాయి.
సేవా నేతృత్వ వృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి. లేదా అభివృద్ధిని సాధించేందుకు అంతర్జాతీయ హరిత పరివర్తనా క్రమంలో పునర్వినియోగ వనరుల డిమాండ్‌ను ఉపయోగించుకుంటున్నాయి.
30 ఏళ్ళ క్రితం డబ్ల్యుటిఓ ఏర్పడినప్పటి నుండి ఆర్థిక వ్యవస్థల మధ్య ఆదాయ అసమానతలు తగ్గించడంలో వాణిజ్యమనేది కీలక పాత్ర పోషిస్తుందని కూడా డబ్ల్యుటిఒ నివేదించింది. పేదరికాన్ని తగ్గించడంలో, భాగస్వామ్య సంక్షేమాన్ని సృష్టించడంలో వాణిజ్యం యొక్క పరివర్తనా పాత్రను పునరుద్ఘాటించడం ఈ నివేదిక నుండి దూరం జరిగే అంశమే అవగలదని డబ్ల్యుటిఓ డైరెక్టర్ జనరల్ ఎన్‌గోజి ఒకొంజో ఇవెలా, నివేదికకు తన ముందు మాటలో పేర్కొన్నారు.
అయితే, గత 30 ఏళ్ళ సార్వజనీకరణ క్రమంలో వెనుకబడిన ప్రజల కోసం, ఆర్థిక వ్యవస్థల కోసం వాణిజ్యం, డబ్ల్యుటిఓ మరింత మెరుగ్గా పనిచేయగలిగేలా చేయడానికి మనం మరింత చేయాల్సి వుందన్నది రెండో అంశమని ఆమె పేర్కొన్నారు. 1996-2021 మధ్య జిడిపిలో అధిక వాణిజ్యం వాటాకు తక్కువ, మధ్య ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థల్లో శీఘ్రగతి అభివృద్ధికి మధ్య బలమైన సంబంధముందని నివేదిక పేర్కొంది.
అధిక ఆదాయం కలిగిన దేశాల్లో తలసరి జిడిపిలో గల అంతరాన్ని తగ్గించడంలో కూడా దోహదపడిందని పేర్కొంది. వృత్తిపరమైన శిక్షణ, నిరుద్యోగ భృతి, మరింత నైపుణ్యాలతో కూడిన కార్మిక వర్గం కోసం విద్య, తక్కువ ధరల వల్ల వినియోగదారులు లబ్దికి హామీ కల్పిస్తూ పోటీ విధానం రూపొందించడం, అలాగే సమర్ధవంతమైన మౌలిక వసతుల కల్పన, ఆర్థిక మార్కెట్లు బాగా పనిచేసేలా చూడడం వంటి దేశీయ విధానాలు చేపట్టాల్సిన అవసరం వుందని డబ్ల్యుటిఓ నొక్కి చెప్పింది.
వాణిజ్య వ్యయాలను తగ్గించాలని, డిజిటల్ అంతరాలను తగ్గించాలని కోరింది. అంతర్జాతీయ సంస్థలు, సంఘాల మధ్య మరింత మెరుగైన సమన్వయం వుండాలని నివేదిక పిలుపిచ్చింది. వాణిజ్య విధానాలు, అనుబంధ విధానాల మధ్య అంతరాలను తగ్గించడానికి, పలు దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య, ఆలాగే దేశ ఆర్థిక వ్యవస్థలో అందరినీ కలుపుకుని పోవడాన్ని పెంచుకోవడానికి ఇది దోహదపడుతుందని పేర్కొంది.
More Stories
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం
రెండు రైతు సంక్షేమ పథకాలకు రూ.లక్ష కోట్లు