విష జ్వరాలతో అల్లాడుతున్న కర్ణాటక ప్రజలు

విష జ్వరాలతో అల్లాడుతున్న కర్ణాటక ప్రజలు
విష జ్వరాలతో కర్ణాటక ప్రజలు అల్లాడిపోతున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరింత అద్వానంగా తయారైంది. రోగులకు వైద్యం చేయడానికి సరిపడా డాక్టర్లు లేరు. మందులు అసలే లేవు. ఇదీ కాంగ్రెస్‌ ఏలుబడిలో కర్ణాటకలో కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితి. అయితే, ప్రజారోగ్యాన్ని పట్టించుకోని సిద్ధరామయ్య ప్రభుత్వం వరుస స్కాంలు, రాజకీయాలతో బిజీగా ఉండటం సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నది.

ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని పలు గ్రామాలు, ఏజెన్సీల్లో డెంగ్యూ, చికెన్‌గున్యా, టీబీ వంటి విష జ్వరాలు పెద్దయెత్తున ప్రబలాయి. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, జిల్లా దవాఖానలకు వేలాది మంది రోగులు క్యూ కట్టారు. అయితే, ప్రభుత్వ దవాఖానల్లో తగినంత ఆరోగ్య సిబ్బంది, డాక్టర్లు లేకపోవడంతో వైద్య సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయే దుస్థితి వాటిల్లింది. 

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో 1,940 డాక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు హెల్త్‌ కమిషనర్‌ శివకుమార్‌ కేబీ స్వయంగా వెల్లడించారు. ఇక, ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో పారాసిటమాల్‌ వంటి మందు గోలీలు కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇది ఇలాగే కొనసాగితే, రాష్ట్రంలో ఆరోగ్య సంక్షోభం నెలకొనవచ్చని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కాగా ప్రభుత్వ దవాఖానలకు సరఫరా చేయాల్సిన అత్యవసర మందుల్లో 190 రకాల మందులు అందుబాటులో లేవని ఆరోగ్యమంత్రి దినేశ్‌ గుండురావు ఇటీవల పేర్కొనడం ప్రస్తుత దుస్థితికి అద్దంపడుతున్నది. ప్రజలు విషజ్వరాలతో ఒకవైపు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవిని కాపాడుకోవడంలో బిజీగా ఉన్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముడా, వాల్మీకి స్కాం ఆరోపణలతో సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి దిగిపోతే, ఆ పోస్టును దక్కించుకోవడంలో ఇతర మంత్రులు బిజీగా ఉన్నట్టు ఎద్దేవా చేస్తున్నాయి. 

కాగా, విష జ్వరాలకు సంబంధించి గ్రామాల్లో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయని, అయితే, అక్కడి ఆరోగ్య కేం ద్రాల్లో తగినంత మంది సిబ్బంది, మందులు, సదుపాయాలు లేకపోవడంతో తాము ఏమీ చేయలేని దుస్థితి వాటిల్లిందని బెంగళూరు మెడికల్‌ కాలేజీ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఓ సీనియర్‌ డాక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.