జమిలి ఎన్నికలకు పట్టుదలతో మోదీ ప్రభుత్వం

జమిలి ఎన్నికలకు పట్టుదలతో మోదీ ప్రభుత్వం

లోక్‌సభలో బీజేపీకి సొంతగా సంపూర్ణ మెజారిటీ లేనప్పటికీ జమిలి ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టుదలగా ఉంది. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’కు పార్టీలకతీతంగా మద్దతు లభిస్తుందని మోదీ సర్కారు ఆశాభావంతో ఉంది. మోదీ సారథ్యంలోని ప్రభుత్వం మూడోసారి అధికార పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తవుతోందని, పాలక కూటమిలో సమన్వయం అద్భుతంగా ఉందని, ఈ బంధం ఐదేళ్లూ పటిష్ఠంగా కొనసాగుతుందని గట్టిగా భావిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

‘జమిలి ఎన్నికలు ఈ టర్మ్‌లోనే అమలవుతాయి. వాస్తవ రూపం దాల్చబోతోంది’ అని వెల్లడించాయు. లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో జమిలి ఎన్నికల హామీ కూడా ఉంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు సమాంతరంగా ఒకేసారి ఎన్నికలు జరపాలని, ఇవి పూర్తయిన వంద రోజుల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఇప్పటికే సిఫారసు చేసింది. 

జాతీయ లా కమిషన్‌ కూడా 2029 నుంచి లోక్‌సభ, అసెంబ్లీలు, పంచాయతీలు/మున్సిపాలిటీలకు ఒకే దఫా ఎన్నికలు జరపాలని, ఒకవేళ త్రిశంకు సభ ఏర్పడితే లేదా అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాలు ఓడిపోతే ఐక్య ప్రభుత్వాలు ఏర్పాటుచేయాలన్న నిబంధనతో విడిగా ఓ నివేదిక సమర్పించే అవకాశం ఉంది.  వీటిని పరిశీలించి ఇప్పుడున్న చట్టాలను సరైన విధంగా సవరించి దేశంలో ఏకకాల ఎన్నికలకు అనుమతి కల్పించేందుకు చట్టం చట్రంలోకి ఈ విషయాన్ని తీసుకువచ్చేందుకు లా కమిషన్ చర్యలు తీసుకోనుంది. దేశంలో జమిలి నిర్వహణకు ఇదే కీలకం అవుతుంది.

తన సిఫారసుల అమలుకు ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేయాలని కోవింద్‌ కమిటీ ప్రతిపాదించింది. దేశంలో జమిలీ నిర్వహణకు కోవింద్ కమిటీ ఎటువంటి కాలపరిమితి విధించలేదు. అలాగే జమిలి ఎన్నికలకు 18 రాజ్యాంగ సవరణలను సూచించింది. వీటిలో ఎక్కువ సవరణలకు రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అక్కర్లేదని వివరించింది.

దీనితో లా కమిషన్ సంబంధిత ఎన్నికల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు వీలేర్పడుతుంది. ఇక ఈ ఎన్నికల ప్రక్రియకు రాజ్యాంగ సవరణ బిల్లు అత్యంత పరీక్షా ఘట్టం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ఆమోదానికి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తే ఇక జమిలి నిర్వహణ మరింత వేగవంతం అవుతుందని లా కమిషన్ వర్గాలు ధృవీకరించాయి.