ప్రజాపాలన దినోత్సవం కాదు… ప్రజావంచన దినోత్సవం

ప్రజాపాలన దినోత్సవం కాదు… ప్రజావంచన దినోత్సవం
సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్  కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస పార్టీ ప్రజలను వంచించినందున “తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని” నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు. 
 
తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన రజకార్ల పార్టీ వారసులకు కాంగ్రెస్ వత్తాసు పలకడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. అంతకుముందు మాట్లాడిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ విమోచన పోరాటాలను పాఠ్యంశంగా పొందుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలను, త్యాగాలను గుర్తు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా “తెలంగాణ విమోచన దినోత్సవం” నిర్వహిస్తోందని తెలిపారు.

తెలంగాణ విమోచన దినోత్సవాల నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు పలువురు నేతలతో కలిసి ఫోటో ఎగ్జిబిషన్‌ను బండి సంజయ్ తిలకించారు.

“తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటాల చరిత్రను 75 ఏళ్లపాటు తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారు. ఎన్నో ఏళ్లపాటు తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని యువకులు జాతీయ జెండాలు పట్టుకుని ఉద్యమించారు. లాఠీదెబ్బలు తిన్నారు” అని గుర్తు చేశారు.
 “నాడు తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలు మామూలు విషయం కాదు. రజాకార్ల పాలనలో దారుణాలు అన్నీ ఇన్నీ కావు. బైరాన్ పల్లి, గుండ్రాంపల్లి, పరకాల, వెయ్యి ఊడల మర్రి సంఘటనలు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయి. నగ్నంగా మహిళలను బతుకమ్మ ఆడించిన దురాగతాలు మరవలేం.” అని సంజయ్ వివరించారు.