ట్యాంక్‌బండ్‌ వద్ద ఫ్లెక్సీలు, బారికేడ్లను తొలిగిన గణేశ్‌ ఉత్సవ సమితి

ట్యాంక్‌బండ్‌ వద్ద ఫ్లెక్సీలు, బారికేడ్లను తొలిగిన గణేశ్‌ ఉత్సవ సమితి
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనాల అంశంపై ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ట్యాంక్ బండ్‌పై గణేశ్ నిమజ్జనాలపై నిషేధ ఆంక్షలు విధిస్తు పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఫ్లెక్సీలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిషేదం విధించినట్లు బోర్డులు పెట్టారు. అయితే, నిమజ్జనంపై అనుమతి ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ ఆంక్షలు కొనసాగుతూ ఉండటం పట్ల భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఆదివారం ఉదయం ట్యాంక్ బండ్‌పై చేరుకున్న కమిటీ సభ్యులు అక్కడ ఏర్పాటు చేసిన బారిగేడ్లను తొలగించారు.  పోలీసుల ఆదేశాలను ధిక్కరించి జాలీలను తొలగించి హుస్సేన్ సాగర్‌లో గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. నిమజ్జనాలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తోందని వారు మండిపడ్డారు. 
 
అనేక ఏండ్లుగా ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనం జరుగుతుందని.. ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని ఉత్సవ సమితి నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2022, 2023లో కూడా ఇలాగే చేశారని, చివరకు ట్యాంక్‌బండ్‌లోనే గణేష్ నిమజ్జనాలు జరిగాయని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్‌ బండ్‌ఫై వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనట్లయితే హైదరాబాద్‌ వ్యాప్తంగా సోమవారం ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
 
‘ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వం వెంటనే గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలి. లేని పక్షంలో ఈ రోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగరా వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తాం. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతాం’ అని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.
 
ఇదిలా ఉండగా హైదరాబాద్ గ్రేటర్ వాప్యంగా సెప్టెంబర్ 17న నిమజ్జనాలు జరగనున్నాయి. ఖైరతాబాద్ మహా గణపతిని కూడా ఆరోజే నిమజ్జనం చేస్తారు. అందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. నిమజ్జనం కోసం 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. అన్ని చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 
 
నిమజ్జనం రోజున ఉండే వేరే కార్యక్రమాలకు ప్రత్యేకంగా బందోబస్తు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక సిబ్బందిని నగరానికి తెస్తున్నామని తెలిపారు.