లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు

లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసు కేసు నమోదు కావడంతో జనసేన ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఆయనపై రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఓ ప్రకటనలో తెలిపింది. 
 
తక్షణం నిర్ణయం అమలులోకి వస్తుందని పార్టీ నేత వేముల అజయ్‌ కుమార్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదయింది. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది.  రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్‌పై సెక్షన్‌ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారు. కేసు విచారణను నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.
 
అవుట్‌ డోర్‌ షూటింగ్‌ సమయంలో నార్సింగ్‌లోని తన నివాసంలో తనను పలుసార్లు లైంగిక వేధించాడని బాధితురాలు ఆరోపించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన బాధితురాలు గత ఆరునెలలుగా జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నది. చెన్నై, ముంబయి, హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో అవుట్‌ డోర్‌ షూటింగ్‌కు వెళ్లిన సందర్భాల్లో వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. 
 
లైంగిక దాడికి పాల్పడడంతో పాటు గాయపరిచాడని, నార్సింగ్‌లోని తన ఇంటికి వచ్చి ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపించింది. సదరు మహిళ 2019 నుంచి జానీ మాస్టర్‌ దగ్గర అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కొరియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా షేక్ జానీ ఉన్నారు. ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఓ యువతి జానీ మాస్టర్‌పై అత్యాచారం ఆరోపణలు చేయడంతో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఓ వ్యక్తి చేసిన పొరపాటు వలన అసోసియేషన్‌కు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో జానీ మాస్టర్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం కొరియోగ్రాఫర్స్‌ అత్యవసర సమావేశం జరగనుంది.

ఇక జానీ మాస్టర్‌పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి.  2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్‌ కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. గతేడాది జూన్‌లో సతీశ్‌ అనే కొరియోగ్రాఫర్‌ సైతం సినిమాల్లో అవకాశాలు వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా పోలీసు కేసు నేపథ్యంలో జానీ మాస్టర్‌ పరారీలో ఉన్నట్లు తెలుస్తున్నది.