మతాన్ని మరచి స్వార్థానికి లోనయ్యామని, అందుకే అంటరానితనం మొదలైందని చెబుతూ ఎక్కువ, తక్కువ అనే భావనను పూర్తిగా నిర్ములించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపిచ్చారు. సంఘ్ కార్యనిర్వహణ ప్రభావవంతంగా ఉన్నచోట, సంఘానికి అధికారం ఉన్నచోట హిందువుల కోసం కనీసం దేవాలయాలు, నీరు, శ్మశాన వాటికలు తెరవబడతాయని చెబుతూ ఈ పని సమాజ ఆలోచనను మార్చడం ద్వారా జరగాలని, సామాజిక సామరస్యంతో మార్పు తీసుకురావాలని సూచించారు.
ఆదివారం అల్వార్‌లోని ఇందిరా గాంధీ ఖేల్ మైదాన్‌లో అల్వార్ నగరంలో స్వయంసేవక్ లను ఉద్దేశించి ప్రసంగిస్తూ సామాజిక సామరస్యం, పర్యావరణం, కుటుంబ జ్ఞానోదయం, స్వీయ- పౌర క్రమశిక్షణ అనే ఈ ఐదు అంశాలను తమ జీవితాల్లో చేర్చుకోవాలని ఆయన స్వయంసేవక్ లకు పిలుపునిచ్చారు. ఎప్పుడైతే తమ జీవితాల్లో వీటిని పొందుపరుస్తారో, అప్పుడు సమాజం కూడా వాటిని అనుసరిస్తుందని ఆయన చెప్పారు.
వచ్చే ఏడాదికి సంఘ్ కార్యాక్రమానికి 100 ఏళ్లు పూర్తవుతాయని చెప్పారు. సంఘ్ పని విధానం చాలా కాలంగా కొనసాగుతోందని, మనం పనిచేసేటప్పుడు, దాని వెనుక ఉన్న ఆలోచన ఏమిటో మనం సరిగ్గా అర్థం చేసుకోవాలని, మన పని వెనుక ఈ ఆలోచన ఎల్లప్పుడూ మేల్కొలపాలని, తద్వారా మన దేశాన్ని మనం శక్తివంతం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
“ఇది హిందూ దేశం అని ప్రార్థనలోనే చెప్పుకున్నాం. ఎందుకంటే దానికి కారణం హిందూ సమాజం. ఈ దేశానికి ఏదైనా మంచి జరిగితే హిందూ సమాజ ఖ్యాతి పెరుగుతుంది. దేశంలో ఏదైనా తప్పు జరిగితే, ఆ నింద హిందూ సమాజంపై పడుతుంది. ఎందుకంటే అది ఈ దేశానికి యజమాని” అని వివరించారు. జాతిని ఉజ్వలంగా, శక్తివంతంగా తీర్చిదిద్దే పనిని కృషితో చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
“మనం సమర్థులుగా మారాలి, దీని కోసం మొత్తం సమాజాన్ని సమర్థంగా మార్చాలి. మనం పిలిచే హిందూ మతం నిజానికి మానవ ధర్మం. ఇది ప్రపంచ మతం. ఇది ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కాంక్షిస్తూ పనిచేస్తుంది. హిందువు అంటే ప్రపంచంలోనే అత్యంత ఉదార మానవుడు, అన్నింటినీ అంగీకరించేవాడు, అందరి పట్ల సద్భావన కలిగి ఉంటారు” అని డా. భగవత్ చెప్పారు.
శక్తివంతమైన పూర్వీకుల వారసుడు. విద్యను వివాదాలు సృష్టించడానికి కాకుండా జ్ఞానాన్ని పంచడానికి ఉపయోగిస్తాడు. సంపదను మత్తు కోసం కాకుండా దాతృత్వానికి ఉపయోగిస్తాడు. బలహీనులను రక్షించడానికి శక్తిని ఉపయోగిస్తాడు. ఇదే వారి వ్యక్తిత్వం, వారి సంస్కృతి, హిందూ అంటే వారే. అతను ఎవరినైనా ఆరాధించవచ్చు, ఏ భాషలోనైనా మాట్లాడవచ్చు, ఏ కులంలోనైనా జన్మించవచ్చు, ఏ ప్రాంతంలోనైనా ఉండవచ్చు, ఏదైనా ఆహార ఆచారాలను అనుసరించవచ్చు. ఎవరైతే ఈ విలువలు కలిగి ఉంటారో, ఈ సంస్కృతి ఉన్నవారందరూ హిందువులే అని డా. భగవత్ స్పష్టం చేశారు.
సంఘ్ గురించి ఇంతకు ముందు ఎవరికీ తెలియదని, ఇప్పుడు అందరికీ తెలుసని, ఇంతకు ముందు సంఘాన్ని ఎవరూ నమ్మేవారు కాదని, నేడు ప్రతి ఒక్కరూ- మనల్ని వ్యతిరేకించే వారు కూడా ఇప్పుడు నమ్ముతున్నారని ఆయన తెలిపారు. వారు తమ పెదవులతో మనల్ని వ్యతిరేకిస్తారని,, కానీ వారు దానిని తమ హృదయాలలో నమ్ముతారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం జాతి సర్వతోముఖాభివృద్ధికి హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని కాపాడుకోవాలని సూచించారు.
హిందూ సంప్రదాయం పర్యావరణానికి సంబంధించి ప్రతిచోటా చైతన్యాన్ని చూస్తుందని, కాబట్టి పర్యావరణానికి సంబంధించి మనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మనం చిన్న విషయాలతో ప్రారంభించాలని చెబుతూ నీటిని ఆదా చేయండి, చెట్లను నాటండి, ఇంటిని హరితమయంగా మార్చండి, ఇంట్లో పచ్చదనం, ఇంట్లో తోటతో పాటు సామాజికంగా కూడా వీలైనన్ని చెట్లను నాటండి అంటూ వివరించారు.
భారతదేశంలో కూడా కుటుంబ విలువలు ప్రమాదంలో పడ్డాయని డా. భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాను దుర్వినియోగం చేయడం వల్ల కొత్త తరం తమ విలువలను చాలా వేగంగా మరచిపోతోందని పేర్కొంటూ అందువల్ల, వారానికి ఒకసారి, మీ కుటుంబ సభ్యులందరూ ఒక నిర్దిష్ట సమయంలో కూర్చోవాలని ఆయన సూచించారు. తమ విశ్వాసం ప్రకారం ఇంట్లో భజన పూజ చేసి, ఆ తర్వాత ఇంట్లో వండిన ఆహారాన్ని కలిసి తినాలని ఆయన చెప్పారు.
సమాజానికి కూడా ఏదైనా చేయాలని ప్రణాళికలు వేసుకోవాలని, ఇందుకోసం కుటుంబ సభ్యులందరూ చిన్న చిన్న తీర్మానాలు చేయాలని తెలిపారు. మీ ఇంటిలోని భాష, వేషధారణ, భవనం, ప్రయాణం, ఆహారం మీ స్వంతంగా ఉండాలని, ఈ విధంగా కుటుంబ జ్ఞానోదయం చేయాలని డా. భగవత్ తెలిపారు. మన ఇంట్లో స్వదేశీ నుంచి ఆత్మగౌరవం వరకు అన్నీ ఉన్నాయని, వాటిని ప్రోత్సహించాలని చెప్పారు.
మన దేశంలో తయారయ్యే వస్తువులను బయటి నుంచి కొనకూడదని స్పష్టం చేశారు. మన జీవితానికి అత్యవసరమైనదైతే దానిని మన స్వంత నిబంధనల ప్రకారం కొనాలని తెలిపారు. దీనితో పాటు మన జీవితంలో పొదుపు పాటించాలని చెప్పారు. సామాజిక సేవలో సమయాన్ని వెచ్చించడం సమాజానికి మేలు చేయడం కోసం కాదని, అది మన కర్తవ్యం అని మనం గుర్తుంచుకోవాలని డా. భగవత్ సూచించారు.
పౌర క్రమశిక్షణ కలిగి ఉండాలని చెబుతూ మనం ఈ దేశ పౌరులం కావడంతో మనలో పౌరసత్వ భావన ఉండాలని చెప్పారు. ఆళ్వార్ నగర సమ్మేళనం సందర్భంగా, నాలుగు శివారు ప్రాంతాల్లోని నలభై ప్రాంతాల నుండి 2842 మంది స్వయంసేవక్ లు పాల్గొన్నారు.
More Stories
సచివాలయంపై నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం