6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
 
* సోమవారం మరో 10 వందే భారత్ రైళ్లు ప్రారంభం
 
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జార్ఖండ్‌ లో 6 కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ప్రధాని మోదీ జంషెడ్‌పూర్ పర్యటన భారీ వర్షం కారణంగా రద్దు కావడంతో  రాంచీ విమానాశ్రయం నుంచి ఆన్‌లైన్‌లో వివిధ పథకాలను ప్రారంభించారు. జార్ఖండ్‌ను వేగంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
 
ఈ క్రమంలో కొత్త వందేభారత్ రైళ్ల సంఖ్య 54 నుంచి 60కి పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ ఆరు రైళ్లు టాటానగర్ – పట్నా, బ్రహ్మపూర్ – టాటానగర్, రూర్కెలా – హౌరా, డియోగఢ్‌ – వారణాసి, భాగల్పూర్ – హౌరా, గయా – హౌరా లాంటి ఆరు కొత్త మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. దీంతోపాటు మోదీ రూ.21 వేల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

కాగా, సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ మరో 10 వందే భారత్‌ రైళ్లను ప్రారంభించనున్నారు. వీటిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. విశాఖ- దుర్గ్‌, సికింద్రాబాద్‌- నాగ్‌పూర్‌ మధ్య కొత్తగా వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు దేశంలోనే తొలి వందే మెట్రో రైలును కూడా మోదీ  ప్రారంభిస్తున్నారు. 

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ  ఆదివారం గుజరాత్‌కు చేరుకోనున్నారు. అహ్మదాబాద్‌కు సమీపంలోని వద్సార్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గంటారు. సోమవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు అహ్మదాబాద్‌- గాంధీనగర్‌ మెట్రో రెండోదశ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో భాగంగానే వందే మెట్రో సర్వీసులనూ ప్రారంభించనున్నారు.

తొలి వందే మెట్రో సర్వీసు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌- భుజ్‌ నగరాల మధ్య సెప్టెంబర్‌ 16వ తేదీన ప్రారంభం కానుంది. ఈ వందే మెట్రో పూర్తిగా అన్‌రిజర్వ్‌డ్‌ ఎయిర్‌ కండీషన్‌ రైలు. మొత్తం 12 కోచ్‌లు ఉండే ఈ రైలులో 1150 మంది కూర్చుని, 2058 మంది నిల్చుని ప్రయాణం చేయొచ్చని పశ్చిమ రైల్వే పీఆర్‌ఓ ప్రదీప్‌ శర్మ వెల్లడించారు. 

అహ్మదాబాద్‌- భుజ్‌ మధ్య నడిచే ఈ రైలు 9 స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. 360 కిలోమీటర్ల దూరాన్ని 5. 45 గంటల్లోనే చేరుకుంటుందని ఆయన చెప్పారు. గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం భుజ్‌లో 5.05 గంటలకు ప్రారంభమై.. ఉదయం 10.50 గంటలకు అహ్మదాబాద్‌ జంక్షన్‌కు చేరుకుంటుందని శర్మ తెలిపారు. 

తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి.. భుజ్‌కు రాత్రి 11.10 గంటలకు చేరుకోనుంది. రెయిన్‌ రెసిస్టెంట్‌ ఇంటీరియర్‌, ఫైర్‌ డిటెక్షన్‌, సీసీటీవీ కెమెరాలు, కుదుపులు లేని డిజైన్‌ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. 

ఈ రైలుకు కొన్ని నిమిషాల ముందే ప్రయాణికులు టికెట్‌ కొనుగోలు చేసుకోవచ్చు. వందే భారత్‌ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్‌లు, కవచ్‌ వంటి భద్రతా సౌకర్యాలతో దీన్ని రూపొందించినట్లు రైల్వే వెల్లడించింది. కనీస టికెట్‌ ధర రూ.30గా నిర్ణయించారు. అలాగే, వీక్లీ, బై-వీక్లీ సీజన్‌ టిక్కెట్లు.. నెలవారీ పాస్‌లు కూడా ఉంటాయి.