కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనలో చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ భారతీయడు కాదని, ఆయన తన జీవితకాలంలో అధిక సమయం విదేశాల్లోనే గడుపుతారని ధ్వజమెత్తారు. విదేశీ పర్యటనల్లో భారత్ గురించి తప్పుగా మాట్లాడతారని, ఆయనకు దేశం పట్ల ప్రేమ లేదని దుయ్యబట్టారు.
సిక్కు వర్గాలను ఉద్దేశించి అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ, రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. . వేర్పాటువాదులు, బాంబులు, తుపాకీలు తయారుచేసేవారు, మోస్ట్ వాంటెడ్ పీపుల్ వంటి మారు మాత్రమే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రశంసిస్తారని ఎద్దేవా చేశారు.
విమానాలు, రైళ్లు, రహదారులను తగులబెట్టే దేశ శత్రువులే రాహుల్‌ను సమర్దిస్తారని వ్యాఖ్యానించారు. దేశానికి అతిపెద్ద శత్రువు, నెంబర్ వన్ టెర్రరిస్ట్‌ను ఎవరినైనా పట్టుకోవాలంటే అది రాహుల్ గాంధీ మాత్రమేనని మండిపడ్డారు.
”రాహుల్ గాంధీ ఇండియన్ కాదు. ఆయన ఎక్కువ సమయం బయటే గడిపారు. ఆయనకు ఈ దేశంపై ఏమాత్రం ప్రేమ లేదు. అందువల్లే విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారతదేశాన్ని వక్రీకరించి మాట్లాడుతుంటారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలను మోస్ట్ వాటెండ్ పీపుల్, వేర్పాటువాదులు, బాంబులు-తుపాకులు-బుల్లెట్ల తయారీ నిపుణులు మాత్రమే అభినందిస్తుంటారు” అంటూ ఆరోపించారు.
“వాళ్లు కూడా రాహుల్ మాట్లాడినట్టే మాట్లాడతారు. అలాంటి వ్యక్తులు రాహుల్‌కు మద్దతు తెలుపుతున్నారంటే దేశంలో నెంబర్ వన్ టెర్రరిస్టు ఆయనే అవుతారు” అని బిట్టూ విమర్శించారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని బిట్టూ విడిచిపెట్టి బీజేపీలో చేరారు.
రాహుల్ గాంధీని నెంబర్ వన్ టెర్రరిస్టుతో పోలుస్తూ కేంద్ర మంత్రి బిట్టూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇలాంటి వ్యక్తులను చూస్తే జాలి కలుగుతుందని, కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాహుల్‌గాంధీపై ప్రశంసలు కురిపించి, ఇప్పుడు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి విధేయుత చాటుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సందీప్ దీక్షిత్ ఆక్షేపణ తెలిపారు.
వర్జీనియాలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో సిక్కుల గురించి రాహుల్ మాట్లాడుతూ ”సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా లేదా అనే దానిపై భారత్‌లో పోరాటం జరుగుతోంది. సిక్కులు కడాను ధరించి, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా? ఇది సిక్కులకు మాత్రమే కాదు. అన్ని మతాలకు సంబంధించినది” అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఢిల్లీలోని రాహుల్ ఇంటిముందు ఆందోళన సైతం చేపట్టింది.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
లింగాయత్‌ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి