ఢిల్లీ లిక్కర్ స్కాంలో దాదాపు 6 నెలల పాటు జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఫలితంగా రెండు రోజుల క్రితం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా తన రాజీనామా నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఢిల్లీ సీఎం వెల్లడించారు.
“ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేస్తాను. ప్రజలు తమ తీర్పును వెల్లడించే వరకు నేను ఆ సీటులో కూర్చోను. ఢిల్లీలో ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. కోర్టులో నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రజా కోర్టులో నాకు న్యాయం జరుగుతుంది. ప్రజల తీర్పు వచ్చిన తర్వాతే నేను తిరిగి ఢిల్లీ సీఎం కుర్చీలో కూర్చుంటాను,” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
తనతో పాటు మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహితం తిరిగి ప్రజా తీర్పు పొందేవరకు అధికారం చేబట్టబోరని స్పష్టం చేశారు. తాను సీఎంగా రాజీనామా చేసిన అనంతరం, ఆప్ నేతల్లో ఒకరు ఆ పదవిని చేపడతారని కేజ్రీవాల్ తెలిపారు. తాను మాత్రం ప్రజల్లోకి వెళ్లి, ప్రజల మద్దతును సేకరిస్తానని స్పష్టం చేశారు.
ఢిల్లీలో 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ నవంబర్‌లో జరిగే మహారాష్ట్ర ఎన్నికలతో పాటు డిల్లీలోనూ ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. వాస్తవానికి కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. కానీ ఆయన రాజీనామా చేయలేదు. దీనికి గల కారణాన్ని ఆప్ అధినేత తాజాగా వివరించారు.
“దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే నేను రాజీనామా చేయలేదు. వాళ్లు ఎక్కడ ఓడినా సీఎంను జైలుకు పంపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కొత్త ఫార్ములాను రూపొందిస్తున్నారు. కర్ణాటక సీఎం మీద కేసు వేశారు. కేరళ సీఎం, పశ్చిమ్ బెంగాల్ సీఎం మీద కూడా కేసు వేశారు. తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపితే రాజీనామాలు చేయొద్దని బీజేపీయేతర ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా,” అని కేజ్రీవాల్ సూచించారు.
అదే సమయంలో బిజెపిపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్రిటీషర్ల కన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వమే నియంతృత్వ పాలనను కొనసాగిస్తోందని విమర్శించారు. బీజేపీ తమ పార్టీని విచ్ఛిన్నం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోందని ఆరోపించారు. తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని కూడా చూసిందని, కానీ బీజేపీ నేతలు విఫలమయ్యారని ఆయన తేల్చి చెప్పారు.
“పార్టీని విచ్ఛిన్నం చేయాలని, కేజ్రీవాల్ ధైర్యాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీయాలని అనుకున్నారు. పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ఎమ్మెల్యేలను విచ్ఛిన్నం చేయడం, నాయకులను జైలుకు పంపడం వంటి ఫార్ములాను రూపొందించారు. కేజ్రీవాల్‌ను జైలుకు పంపడం ద్వారా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని భావించారు. కానీ వారు మా పార్టీని విచ్ఛిన్నం చేయలేకపోయారు. పార్టీ కార్యకర్తల నుంచి కూడా వేరు చేయలేకపోయారు,” అని ఢిల్లీ సీఎం చెప్పుకొచ్చారు.
More Stories
సచివాలయంపై నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం