2024 ఎన్నికలకు ముందు తాను ప్రధాని పదవి పోటీలో ఉంటే తనకు మద్దతు ఇస్తానని ఓ ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు తనకు చెప్పారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అయితే ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానని ఆయన స్పష్టం చేశారు. తన పార్లమెంటరీ నియోజకవర్గం నాగ్‌పూర్‌లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.
“ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు ప్రధానమంత్రి పదవి కోసం నన్ను సంప్రదించారు. నేను ఆమోదం తెలిపితే నన్ను ప్రధానిగా చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు’’ అని గడ్కరీ తెలిపారు. “నేను వెంటనే ఆ ప్రతిపాదనను తిరస్కరించాను. నేను ఆ నాయకుడితో స్పష్టంగా చెప్పాను. నేను భావజాలం, విశ్వాసాన్ని నమ్మే వ్యక్తిని. నేను ఎల్లప్పుడూ అందుకోసమే జీవించాను. విలువలకోసం పనిచేశాను,” అని ఆయన చెప్పారు.
ఆ ప్రతిపక్ష నేత పేరును చెప్పకపోయినప్పటికే, బిజెపికి 2024లో స్పష్టమైన మెజారిటీ రాదనీ, ప్రధాని పదవికి ఇతరుల మద్దతు అవసరం అవుతుందనే అంచనాతో ఈ ప్రతిపాదనను తన వద్ద ఉంచారని గడ్కరీ తెలిపారు.
“అయితే, మీరు నాకు ఎందుకు మద్దతు ఇవ్వాలి? నేను మీ మద్దతు ఎందుకు తీసుకోవాలి?” అని అడిగానని చెబుతూ ప్రధానమంత్రి కావడమేతన జీవితంలో లక్ష్యం కాదని స్పష్టం చేశారు. తాను తన విశ్వాసానికి, తన సంస్థకు విధేయుడినని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. పదవులకన్నా విశ్వాసమే తనకు ముఖ్యమంత్రి తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్- బిజెపిలో మూలాలున్నప్పటికీ, కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల నేతలతో గడ్కరీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలతో పాటు జర్నలిజంలో నైతిక విలువను పాటించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సూచించారు. కమ్యూనిస్ట్ నాయకుడు ఎబి బర్ధన్‌తో తన సుదీర్ఘ స్నేహాన్ని పునరుద్ఘాటిస్తూ గడ్కరీ ఇలా అన్నారు: “బర్ధన్ పట్ల నాకున్న స్నేహం, గౌరవం గురించి నన్ను తరచుగా అడుగుతూ ఉంటారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, నమ్మకం నాకు నచ్చాయి. రాజకీయమైనా, ఏ వృత్తి అయినా విశ్వాసమే ముఖ్యం” అని గడ్కరీ తెలిపారు.
నాగ్‌పూర్ నుండి విదర్భకు చెందిన అత్యంత గోపాప రాజకీయ నాయకులలో దివంగత ఎబి బర్ధన్ కూడా ఉన్నారని తాను ఓ కమ్యూనిస్టు నాయకుడికి చెప్పానని గడ్కరీ చెప్పారు. బర్ధన్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రత్యర్థుడని ఆ నేత ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పుడు, నిజాయితీ గల ప్రతిపక్షాలను గౌరవించాలని స్పష్టం చేసినట్లు గడ్కరీ చెప్పారు. “నిజాయితీతో వ్యతిరేకించే వ్యక్తిని గౌరవించాలని నేను చెప్పాను. ఎందుకంటే ఆయన వ్యతిరేకతతో నిజాయితీ ఉంటుంది. నిజాయితీ లేని వ్యక్తికి గౌరవం లేదు” అని గడ్కరీ స్పష్టం చేశారు.
కాగా, జర్నలిజంలో `సుపారీ’ జర్నలిస్టుల సంఖ్య పెరిగి పోతూ ఉండడంపట్ల గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టాన్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కొందరి జర్నలిస్టులు విలాసవంతమైన జీవనానికి అలవాటు పడుతూ అందుకు అనైతిక పద్దతులను అనుసరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
More Stories
సచివాలయంపై నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం