వాల్మీకి కుంభకోణంలో మాజీ మంత్రి నాగేంద్రనే కీలక సూత్రధారి

వాల్మీకి కుంభకోణంలో మాజీ మంత్రి నాగేంద్రనే కీలక సూత్రధారి
* హైదరాబాద్‌కు చెందిన సత్యనారాయణవర్మ కీలక పాత్ర
 

కర్ణాటకతోపాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నిర్ధారించింది. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే, ఎంపీల ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది.  అయితే, ఇప్పటికే ఈ కేసును విచారించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) బీ నాగేంద్రతో పాటు వాల్మీకి బోర్డు చైర్మన్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్‌లకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

కనీసం ఈ ఇద్దరికి నోటీసులు జారీ చేసి, విచారణ కూడా జరపలేదు.  ఈడీ మాత్రం ఈ మొత్తం కుంభకోణంలో నాగేంద్రనే మాస్టర్‌మైండ్‌ అని తేల్చింది. నాగేంద్రతో పాటు మరో నలుగురిని నిందితులుగా ఈడీ పేర్కొన్నది. ఇప్పటికే నాగేంద్ర ఇండ్లు, కార్యాలయాలలో ఈడీ సోదాలు నిర్వహించి, నాగేంద్రను అరెస్టు చేసింది.

వాల్మీకి కుంభకోణానికి సంబంధించి ఈడీ చార్జిషీట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మతో కలిసి రూ.21 కోట్ల నిధులను నాగేంద్ర పక్కదారి పట్టించినట్టు ఈడీ పేర్కొన్నది. బెంగళూరుతో పాటు బళ్లారి నుంచి ఈ డబ్బులను వివిధ ప్రాంతాలకు అక్రమంగా పంపించారని, లోక్‌సభ ఎన్నికల్లో వీటిని వినియోగించినట్టు ఈడీ గుర్తించింది.

 
‘కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’కు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన రూ.187 కోట్లు పక్కదారి పట్టాయి. వాల్మీకి కార్పొరేషన్‌ అకౌంట్స్‌ సూపరింటెండెంట్‌ పీ చంద్రశేఖరన్‌ గత మే 26న ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఈ స్కామ్‌ గురించి చంద్రశేఖరన్‌ తన ఆరు పేజీల సూసైడ్‌ నోటులో పేర్కొన్నారు. 
 
యూనియన్‌ బ్యాంకు సైతం తమ బ్యాంకులోని వాల్మీకి కార్పొరేషన్‌ ఖాతా నుంచి చట్టవిరుద్ధంగా నగదు బదిలీ అయ్యిందని ఫిర్యాదు చేసింది. సర్వత్రా ఒత్తిడి పెరగడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం.. సిట్‌ ఏర్పాటు చేసింది. ఈడీ సైతం రంగంలోకి దిగింది. లోక్‌సభ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచడం కోసమే ‘వాల్మీకి కార్పొరేషన్‌’ నిధులను అక్రమంగా వాడుకొన్నట్టు ఈడీ, సిట్‌ విచారణలో ప్రాథమికంగా తేలింది.
వాల్మీకి స్కామ్‌లో ఈడీ ప్రధానంగా ప్రస్తావించిన సత్యనారాయణ వర్మ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్‌. ఈయన వాల్మీకి కార్పొరేషన్‌కు సంబంధించిన నిధులను ‘ఫస్ట్‌ ఫైనాన్స్‌ క్రెడిట్‌ కో ఆపరేటీవ్‌ సొసైటీ’ ద్వారా దారి మళ్లించినట్టు ఈడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొన్నట్టు విశ్వసనీయ సమాచారం.  ఈ కుంభకోణానికి సంబంధించిన నిధులతోనే సత్యనారాయణ వర్మ రూ.3.3 కోట్లతో లాంబోర్గిని కారును కూడా కొన్నట్టు ఈడీ గుర్తించింది.
ఈ కుంభకోణంలో సత్యనారాయణ వర్మతోపాటు ఇటకారి సత్యనారాయణ, చంద్రమోహన్‌, నాగేశ్వరరావులు కూడా ఉన్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్‌ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడనే ఆరోపణలున్నాయి. పక్కదారి పట్టించిన కార్పొరేషన్‌ నిధులను లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించారని ఈడీ పేర్కొన్న నేపథ్యంలో సత్యనారాయణ వర్మ వెనుక ఎవరున్నారనేది చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ నిధులకు సంబంధించి కర్ణాటక మంత్రి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు కూడా వచ్చి చర్చల్లో పాల్గొన్నట్టు సమాచారం. ఇక్కడి ఇద్దరు కీలక నేతల్లో ఒకరు రెండుసార్లు బెంగుళూరుకు కూడా ఇదే విషయంపై వెళ్లివచ్చినట్టు తెలుస్తున్నది. సత్యనారాయణ వర్మకు సంబంధించిన వ్యాపారంలోనూ ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు భాగస్వాములుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.