మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రేబర్న్ హౌస్ ఆఫీస్ భవనంలో కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్‌లీ జేమ్స్ షెర్‌మాన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అమెరికా చట్టసభల సభ్యులతో సమావేశమయ్యారు. మిన్నెసోటా ప్రతినిధి ఇల్హాన్ ఒమర్‌తో సహా పలువురు అమెరికా చట్టసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు,
ఆయన భారత వ్యతిరేక భావాలను సమర్థించడంలో పేరు పొందారు. ఈ సమావేశంలో అమెరికా కాంగ్రెస్ సభ్యులు జోనాథన్ జాక్సన్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, బార్బరా లీ, శ్రీ తానేదార్, జీసస్ G. “చుయ్” గార్సియా, హాంక్ జాన్సన్, జాన్ షాకోవ్స్కీ కూడా పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అమెరికా దౌత్యవేత్త డొనాల్డ్ లూ, చట్టసభ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ను కూడా కలిశారని సమావేశాల గురించి తెలిసిన వర్గాలు తెలిపాయి.
అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో మిన్నెసోటా 5వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధి అయిన ఇల్హాన్ ఒమర్ తరచూ భారత్ పై తీవ్రమైన వివాదాస్పద విమర్శలు చేయడంలో పేరొందారు. ఇటీవల, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ మరణంపై భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగినప్పుడు, ఒమర్ కెనడియన్ దర్యాప్తుకు మద్దతు ఇవ్వాలని అమెరికాను కోరారు.
పైగా, అమెరికాలో ఇలాంటి కార్యకలాపాలపై ఓ ప్రకటన చేయాలని అభ్యర్థించారు. ఈ ప్రకటన భారత రాజకీయ నాయకుల నుండి తీవ్ర ప్రతిస్పందనను ప్రేరేపించింది. ఒమర్‌తో రాహుల్ గాంధీ భేటీపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆగ్రహంతో ప్రతిస్పందించింది.
ప్రతి విదేశీ పర్యటనలో “రాడికల్, భారతదేశానికి వ్యతిరేక అంశాల”తో ఎందుకు నిమగ్నమవుతున్నారని ప్రశ్నించింది. బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ, “సిక్కులపై విషం చిమ్మిన తర్వాత, విదేశీ గడ్డపై భారత వ్యతిరేక ప్రచారం చేసిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ భారతదేశ వ్యతిరేక ఇల్హాన్ ఒమర్‌తో సమావేశమయ్యారు. నిమగ్నమయ్యారు” అంటూ ఆయన మండిపడ్డారు.
ఒమర్ అమెరికా కాంగ్రెస్‌లో భారత వ్యతిరేక తీర్మానాలను ప్రవేశపెట్టారని, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పర్యటించడం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించారని, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించారని, హిందువులపై ద్వేషాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషించారని పూనావాలా విమర్శించారు. “రాహుల్ గాంధీ ఆమెను ఎందుకు కలవాల్సి వచ్చింది? ప్రతి విదేశీ పర్యటనలోనూ ఆయన అత్యంత తీవ్రమైన భారత వ్యతిరేక అంశాలతో ఎందుకు నిమగ్నమై ఉన్నారు? బీజేపీ వ్యతిరేక – దేశ వ్యతిరేకత ఒకటేనా?” అంటూ ప్రశ్నించారు.
సీనియర్ బిజెపి నాయకుడు, పార్టీ మీడియా సెల్-ఇన్‌చార్జ్ అమిత్ మాల్వియా ఒమర్‌ను “పాకిస్తాన్ ప్రేరేపిత భారతదేశ వ్యతిరేక స్వరం, రాడికల్ ఇస్లామిస్ట్, స్వతంత్ర కాశ్మీర్ మద్దతుదారుడు” అని అభివర్ణించారు. పాకిస్తానీ నాయకులు సహితం ఇలాంటి “తీవ్రవాదులు”తో కలిసి కనిపించడం పట్ల మరింత జాగురతతో వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఇప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా బహిరంగంగా పనిచేస్తుందని మాల్వియా స్పష్టం చేశారు.
బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా రాహుల్ గాంధీ పాకిస్తాన్ అనుకూలురు, భారత వ్యతిరేక అంశాలను సమర్థిస్తున్నారని ఆరోపించారు. “కాంగ్రెస్ పార్టీ భారతదేశ జాతీయ భద్రతతో రాజీ పడాలని ఎంచుకుంది” అని భండారీ ఎక్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇల్హాన్ ఒమర్ ఎవరు?
ఇల్హాన్ ఒమర్, 41, డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు, అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన మొదటి ముస్లిం మహిళల్లో ఒకరు. సోమాలియా నుండి శరణార్థి అయిన ఒమర్ తన స్వదేశంలో అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంది. ఆమె ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఆమె కుటుంబం దేశం విడిచి పారిపోయింది. అమెరికాకు మకాం మార్చడానికి ముందు నాలుగు సంవత్సరాలు శరణార్థి శిబిరంలో గడిపింది.
ఆమె జనవరి 2019లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇజ్రాయెల్‌ను తరచుగా విమర్శిస్తూ వాఖ్యలు చేస్తుండటంతో ఆమె వివాదాస్పదారాలుగా పేరొందారు. ఫిబ్రవరి 2023లో, ఇజ్రాయెల్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ నుండి ఆమెను బహిష్కరించారు. ఆమె తరచుగా భారతదేశం గురించి చేసిన ప్రకటనలు న్యూఢిల్లీ నుండి తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించాయి.
2022లో, ఒమర్ పాకిస్తాన్‌కు నాలుగు రోజుల పర్యటన సందర్భంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను సందర్శించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒమర్ పీఓకే పర్యటన దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని, ఆమె “సంకుచితమైన” రాజకీయాలను ప్రతిబింబిస్తోందని భారత ప్రభుత్వం మండిపడింది. 2023లో, ఒమర్ భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన నిరాధారమైన వాదనలను ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికా కాంగ్రెస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంయుక్త సెషన్ ప్రసంగాన్ని కూడా ఆమె బహిష్కరించారు.
More Stories
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
జాతీయ స్థాయిలో తాజా పౌరుల రిజిస్టర్ అవసరం
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి నిధులివ్వాలి