హైదరాబాద్‌లో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్ట్‌

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. బుదవారం ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో బుధవారం సాయంత్రం నుంచి నిందితుల వేట మొదలైంది. 
 
నందిగం సురేష్‌ ఉద్దండరాయుని పాలెంలోని నివాసంలో అందుబాటులో లేకపోవడంతో ఆయన అచూకీ కోసం గాలించారు. హైదరాబాద్ మియాపూర్‌లో ఉన్నట్టు గుర్తించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు అక్కడి పోలీసుల సహకారంతో అరెస్ట్‌ చేశారు. సురేష్‌ను హైదరాబాద్‌ నుంచి మంగళగిరి తరలిస్తున్నారు. విచారణ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
 
సురేష్ తో పాటు వైసిపి నాయకుల ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. దీంతో నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నం చేస్తున్నారని సమాచారం అందుకున్న హైదరాబాద్‌కు వెళ్లి పోలీస్ ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. సురేష్‌ను గుంటూరు జిల్లాకు పోలీసులు తరలిస్తున్నారు.
 
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కూడా నిందితుడు కావడంతో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చేసింది.
 
 హైకోర్టు తీర్పు నేపథ్యంలో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో సురేష్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. మొత్తానికి పక్కా సమాచారంతో హైదరాబాద్‌లో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేయడం జరిగింది.