బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగి పోతుండడంతో విజయవాడ నగరం కోలుకుంటోంది. కృష్ణా నది నీటి ప్రవాహం కూడా 3.16 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. బుడమేరు ముంచెత్తడంతో 5 నుంచి 8 అడుగుల వరద నీటిలో మునిగిన అజిత్ సింగ్‌నగర్, పాయకాపురం తదితర ప్రాంతాల్లో దాదాపు 80 శాతం ముంపు నుంచి బయటపడ్డాయి.
బుడమేరు ప్రభావంతో జలదిగ్భందంలో కొనసాగిన కాలనీల్లో నీరు తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఊర్మిలానగర్, హెచ్‌బీ కాలనీ, చిట్టినగర్, కేఎల్‌రావు నగర్, కబేళా, రామరాజునగర్, రోటరీనగర్ ప్రాంతాలను చుట్టుముట్టిన వరద నీరు బయటకు వెళ్తోంది. మోకాలు దిగువ వరకు మాత్రమే ఇప్పుడు నీరు ఉంది.
పాయకాపురం, రాజీవ్‌నగర్‌లో మూడు అడుగుల వరకు నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇబ్బందికరంగా ఉన్న ప్రజలకు ట్రాక్టర్లు, బోట్ల ద్వారా సాయం అందిస్తున్నారు. రాజీవ్‌నగర్, కండ్రిక, పాయకాపురం, పైపుల రోడ్డు, అజిత్‌సింగ్‌నగర్‌లలో వరద తగ్గుముఖం పట్టింది. అక్కడి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
జక్కంపూడి వైఎస్సాఆర్ కాలనీ ఇంకా ముంపులోనే ఉంది. వరద నీటి మునకలో లేని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను క్రమక్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా తయారుచేసిన అత్యవసర వైద్య కిట్లను నేటి నుంచి వైద్యారోగ్యశాఖ యంత్రాంగం అందించనుంది.
వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేస్తున్నారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 3454 మంది కార్మికులతోపాటు 450 మంది ప్రజారోగ్య సిబ్బందిని ఈ పనులకు వినియోగిస్తున్నారు. వీరితోపాటు ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 5889 మంది కార్మికులను రంగంలోకి దించారు.
కాగా, ఇళ్లలో బురద మేట వేయడంతో దాన్ని శుభ్రం చేసుకునేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ఏకంగా ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 48 ఫైర్ ఇంజన్లను తెప్పించారు.వాటిద్వారా వీధుల్లో,ఇళ్లలోకి చేరిన బురద, మురుగు కొట్టేస్తున్నారు.వరద ముంపు నుంచి బయటపడిన జనం ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
సుమారు 60 వేల ఇళ్లు పూర్తిగా వరద ముంపునకు గురయ్యాయని, రూ.600 కోట్ల నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇది కేవలం నివాస గృహాల్లో జరిగిన ఆస్తి నష్టం మాత్రమే. ఒక్కో కుటుంబం కనీసం రూ.లక్ష విలువైన ఆస్తిని నష్టపోయి ఉంటుందని అంచనా.
More Stories
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు
ఏడాదిలోగా గన్నవరంలో ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్
కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్